మొహాలీ, మార్చి 30 (న్యూస్‌టైమ్): ముంబయి ఇండియన్స్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చెలరేగింది. బలమైన ప్రత్యర్థి ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసిన పంజాబ్ బ్యాటింగ్‌లో తన సత్తా ఏమిటో క్రికెట్ ప్రపంచానికి మరోమారు చాటిచెప్పింది. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా ముగ్గురు బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా కదంతొక్కుతూ అలవోకగా ఛేదించారు. దీంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌పై గెలిచింది. అంతకముందు ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసింది.

డికాక్ (39 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (18 బంతుల్లో 32; 5 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (19 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ముంబయి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ రాణించినా మిడిలార్డర్ మళ్లీ విఫలమైంది. రెండో ఓవర్ నుంచే ఓపెనర్లు రోహిత్, డికాక్ కండ్లు చెదిరే షాట్లు బాదారు. టై వేసిన ఐదో ఓవర్‌లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి జోరు చూపెట్టాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే వికెట్ సమర్పించుకోవడంతో తొలి వికెట్‌కు 51 పరుగులు నమోదయ్యాయి. ఆరు బంతుల తర్వాత సూర్యకుమార్ యాదవ్ (11) కూడా వెనుదిరిగినా ఓ ఎండ్‌లో డికాక్ స్థిరంగా చెలరేగాడు.

షమీ బౌలింగ్‌లో పవర్ ఫుల్‌షాట్‌తో సిక్స్ కొట్టిన డికాక్ అశ్విన్ జంట బౌలింగ్‌లో వరుసగా బౌండరీలు బాది అర్ధసెంచరీ పూర్తి చేశాడు. దీంతో పవర్‌ప్లేలో 62/1 స్కోరు చేసిన ముంబయి 12 ఓవర్లలో 110/2కు చేరింది. అప్పటివరకు పటిష్ఠంగా కనిపించిన ముంబయిని మిడిలార్డర్ దెబ్బకొట్టింది. స్వల్ప విరామాల్లో డికాక్, యువరాజ్ (18), పొలార్డ్ (7) ఔటయ్యారు. డికాక్, యువీ మూడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. చివర్లో హార్దిక్ మరోసారి విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సహచరులు వెనుదిరిగినా వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ లైన్ దాటిస్తూ మూడు భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

పొలార్డ్‌తో ఐదో వికెట్‌కు 20, కృనాల్ (10)తో ఆరో వికెట్‌కు 16, మెక్లీంగన్ (0 నాటౌట్)తో ఏడో వికెట్‌కు 13 పరుగులు జత చేయడంతో ముంబయి పోటీ స్కోరును సాధించింది. 177 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఛేదించింది. ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు గాడిలో పడ్డాడు. ముంబయి పేసర్లను దీటుగా ఎదుర్కొంటూ నిధానంగా పరుగులు సాధించాడు. రెండో ఎండ్‌లో యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ (24 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఫోర్‌తో ఖాతా తెరిచాడు. మెక్లీంగన్ వేసిన మూడో ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించి టచ్‌లోకి వచ్చాడు. పవర్‌ప్లేలో 38 పరుగులే వచ్చినా మ్యాచ్ మధ్యలో రాహుల్ బ్యాట్ ఝుళిపించడంతో రన్‌రేట్ పెరిగింది. హార్దిక్ వేసిన ఏడో ఓవర్‌లో గేల్ మళ్లీ తనదైన శైలిలో వరుసగా రెండు టవరింగ్ సిక్సర్లతో మ్యాచ్‌లో ఊపు తెచ్చాడు. కానీ ఎనిమిదో ఓవర్‌లో కృనాల్ గేల్‌కు షాకిచ్చాడు.

ఆఫ్‌సైడ్ టర్నింగ్ బంతిని లాంగాన్‌లోకి పంపే క్రమంలో కరీబియన్ హార్దిక్ చేతికి చిక్కాడు. దీంతో తొలి వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వన్‌డౌన్‌లో వచ్చిన మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు బాదాడు. ఫలితంగా తొలి 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 84/1కి చేరింది.

ఈ దశలో రాహుల్ నెమ్మదించినా మయాంక్ భారీ సిక్సర్‌తో రెచ్చిపోయాడు. 13వ ఓవర్‌లో రెండో సిక్సర్ బాదిన అతను మూడో బంతికి ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రాహుల్‌తో జతకలిసిన మిల్లర్ (10 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా ఎక్కడా తగ్గలేదు. ఇద్దరు చకచకా ఫోర్లు కొట్టడంతో లక్ష్యం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మొత్తానికి ముంబయిపై విజయంతో పంజాబ్ ఐపీఎల్‌లో బోణీ కొట్టినట్లు అయింది.