హైదరాబాద్, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌లు ఉమేష్ సిన్హా, సుదీప్ జైన్ రాష్ట్ర పర్యటనలో భాగంగా సీఎస్ జోషిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, జీఏడీ ముఖ్యకార్యదర్శి అధర్ సిన్హా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్, అదనపు సీఈవో బుద్ధప్రకాశ్ జ్యోతి, ఆర్ధిక శాఖ అధికారి శివశంకర్, అడిషనల్ డీజీ (శాంతిభద్రతలు) జితెందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు 145 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి బలగాలు కేటాయింపుపై చర్చించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటుకు 185 మంది అభ్యర్ధులు పోటి చేస్తున్నందున ఈవీఎంలు, ఈసీఐఎల్, బీహెచ్ఎల్ నుండి వస్తున్నాయని, అవసరమైన అదనపు సిబ్బంది, టేబుల్స్, ప్రజలకు అవగాహన, ఇంజనీర్ల కేటాయింపు, పోలింగ్ బూత్‌లలో సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్లలో కంపార్ట్‌మెంట్‌లు, తదితర అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించామన్నారు.

నిజామాబాద్ ఎన్నికలలో వినియోగించే ఈవీఎంలపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయిస్తామన్నారు. సీఈవో రజత్ కుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎన్నికలకు అవసరమైన అదనపు సిబ్బంది వివరాలు సమర్పిస్తామన్నారు. పోలింగ్ బూత్‌లలో చేపట్టవలసిన వసతులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈవీఎంలను సంబంధిత సాంకేతిక నిపుణులు మొదట విడత తనిఖీ, పరిశీలన జరిపిన తర్వాతే అధికారులు పరిశీలిస్తారన్నారు.