ఛత్తీస్‌గఢ్‌, ఏప్రిల్ 4 (న్యూస్‌టైమ్): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతాబలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్ల అమరులయ్యారు. కాంకేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంకేర్‌ జిల్లాలోని మహ్లా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో 114వ బెటాలియన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు తనిఖీలు చేపట్టారు. తనిఖీలు నిర్వహిస్తుండగా మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాంకేర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్‌ 18న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పోలింగ్‌ సజావుగా సాగేందుకు భద్రతా సిబ్బంది ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే తనిఖీలు నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు.