పంపకాలు లేనిదే ఎన్నికలు లేవన్నది జగమెరిగిన సత్యం. ఎన్నిక ఏదైనా కావచ్చు. డ్వాక్రా, స్వయం సహాయక, కాలనీ, అపార్టుమెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర నుంచి చట్టసభలకు జరిగే ఎన్నిక వరకూ దాదాపు అన్నిటా ఒకటే తంతు. తాయిలాలు ఇవ్వనిదే ఓటు విదల్చని పరిస్థితి. కాకపోతే, ఖర్చు స్థాయి పెరుగుతుందంతే. చిన్న పదవికి పోటీచేసే వారు తక్కువ స్థాయిలో ఖర్చుచేస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు తలపడే వారు కోట్లు కుమ్మరించడం పరిపాటి. విలువైన ఓటును నోటుకు అమ్ముకోవడం మూర్ఖత్వమన్న సూక్తులు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతున్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసే ఓ అభ్యర్ధి ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చుచేసే పరిస్థితి వచ్చిందంటే నమ్మడానికి ఎవరూ సాహసించరు. కానీ, ఇది నిజం. ఇంతకంటే ఎక్కువ పెట్టేవారూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు దేశం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొద్ది గంటల్లో జరగబోయే సాధారణ ఎన్నికల పోలింగ్‌లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీలకు అనుకూల పవనాలు వీస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. మరోవైపు, ఏ ఒక్క జాతీయ నేత కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తనదైన జనాకర్షణ శక్తితో తమ పార్టీని విజయతీరాలకు నడిపిస్తాడనే ఆశాభావం ఆయా పార్టీల రాష్ట్రస్థాయి నేతల్లోనే కనిపించటం లేదు. గత వైభవాల పునాదుల్లోంచి మాత్రమే కాంగ్రెస్, బీజేపీలు ఇప్పుడు గాలిమేడలు కట్టడానికి ప్రయత్నిస్తున్న తీరు కనిపిస్తోంది.

సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోంచే మునుపెన్నడూ లేనిస్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోంచే తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్న రాజకీయ పునరేకీకరణ, సమీకరణ శక్తి ప్రాధాన్యం అవగతం చేసుకోవాలి. ఇవ్వాళ తెలంగాణలో సారు-కారు-పదహారు అన్న నినాద సారాంశాన్ని అర్థం చేసుకోలేక ఈ మాత్రం సంఖ్యాబలంతో కేంద్రంలో ఏం చేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు కొందరు. దేశంలో నెహ్రూ, ఇందిర శకం ముగిసిన తర్వాత ఒక అరుదైన సందర్భాల్లో తప్పితే ఏ జాతీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించి కేంద్రంలో అధికారం చేపట్టిన పరిస్థితి లేదు.

ఇందిరాగాంధీ హత్య తర్వాత ఏర్పడిన సానుభూతి వెల్లువలో రాజీవ్‌గాంధీ 415 సీట్లు సాధించి అఖండ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితుల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ 282 సీట్లు గెలుచుకొని అధికారానికి అవసరమైన సంపూర్ణ మెజారిటీని సాధించింది. అయితే ఇది ఒక ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జనాకర్షక నినాదం వెలుగులో అధికారాన్ని చేజిక్కించుకున్నారన్నది గమనార్హం. దశాబ్దంన్నర కాలంగా దేశవ్యాప్తంగా ఏ పార్టీ సంస్థాగత నిర్మాణాలతో ప్రభావం చూపుతున్న దాఖాలాలు లేవు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ రెండూ ఉత్తరాది పార్టీలుగా మిగిలిపోయిన స్థితి ఉది. ఇప్పుడైతే ఈ పార్టీలు పార్లమెంటులోని మొత్తం 545 సీట్లలో 270 నుంచి 300 సీట్ల కోసం తంటాలు పడుతున్నాయి.

ఇక ఉత్తరాదిలోనూ ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలతో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 2009 ఎన్నికల మాదిరిగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పుంజుకోగలిగితే కాంగ్రెస్ పునరుత్థానం చెందినట్లే. ప్రస్తుత బీజేపీ పరిస్థితి చూస్తే 150 సీట్లు గెలుచుకోవటం గగనంగానే కనిపిస్తున్నది. 80 లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్నాయి. అక్కడ గత ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడక్కడ ఎదురుగాలి ఎదుర్కొంటోంది. 42 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభావం స్పష్టమే. అయితే ఇక్కడ ఎలాగైనా మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక 40 స్థానాలు ఉన్న బీహార్‌లో ఆర్జేడీ (కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకొని) బలమైన పోటీ ఇవ్వడం ఖాయం.

అలాగే 21 స్థానాలు ఉన్న ఒడిషాలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజూ జనతాదళ్‌కు ఈసారి చెక్ పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ అది ఎంతవరకు సాధ్యమౌతుందో చూడాలి. ఇక తమిళనాడు, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీల సహకారం లేకుండా ఒంటరిగా పోటీచేసే స్థితిలో జాతీయపార్టీలు లేవు. ఇక బెంగాల్, ఒడిషా, యూపీ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. ఏ లెక్కన చూసినా ప్రాంతీయ పార్టీల సంఖ్యాబలం 220 దాటే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే లోక్‌సభ సంఖ్యాబలంలో ఒక్క ఎంపీ సీటు కూడా నిర్ణయాత్మకంగా మారబోతోంది. ఈ నేపథ్యం నుంచే ఫెడరల్ ఫ్రంట్ నినాదం తెరమీదికి రావటాన్ని చారిత్రకాంశంగా భావించాలి.

అందుకే కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌కు ఎన్నికల తర్వాత అనుకూల పరిస్థితులు మరింత పెరిగే పరిస్థితులున్నాయి. ఇది వ్యక్తిగత రాజకీయాలు పునాదిగా చేసుకొని చెబుతున్న మాట కాదు. సంకీర్ణ యుగంలో అనివార్యంగా ఏర్పడుతున్న రాజకీయ అవకాశాలు. ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వమే రావచ్చు అన్న చర్చ బలంగా నడుస్తోంది. అయితే సంకీర్ణ రాజకీయాలను నడుపటానికి కావలిసిన ఓపిక, అందర్నీ సమాన ప్రతిపత్తితో కలుపుకుపోయే విశాల భావాలు అటు రాహుల్‌గాంధీలోనూ, ఇటు నరేంద్ర మోదీలోనూ కనిపించటం లేదు. కాంగ్రెస్ రెండుసార్లు సంకీర్ణ ప్రభుత్వాలు నడిపిన తీరు, గత ఐదేళ్లుగా మోదీ అనుసరించిన విధానం కారణంగా నమ్మదగిన రాజకీయ మిత్రపక్షమంటూ లేని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్‌కు అవినీతి కుంభకోణాలు కారణమైతే, బీజేపీకి మోదీ అనుసరించిన వ్యక్తివాద అహంకార ధోరణి ఫలితంగా ఎవరూ దరిచేరని స్థితి ఏర్పడింది. మెజారిటీవాద రాజకీయాలతో మోదీ అనుసరించిన అసహన రాజకీయాలను దేశం యావత్తూ ఏవగించుకుంటున్న స్థితి ఉంది. సరిగ్గా ఈ చారిత్రక పరిస్థితుల్లోంచే కేసీఆర్ చెబుతున్న కాంగ్రెసేతర, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఇప్పుడు చర్చనీయాంశం కావటమే కాదు, అనివార్యంగా కనిపిస్తోంది. ఏదిఏమైనా ఈ మార్పు సాధించాలంటే కేసీఆర్ ఎంత ఖర్చుచేయాలో ఊహించుకుంటుంటేనే భయమేస్తోంది. ఓటుకు వేలకు వేలు పంచితే తప్ప ఓటరు కరుణించని దుస్థితిలో ఉన్న ప్రస్తుతం తరుణంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పు కోరుకోవడం అంత సులువేమీ కాదు.

అయితే, ప్రయత్నిస్తే పోయేదేమీ లేదన్నదీ వాస్తవం. కేవలం పదహారు సీట్లతో కేసీఆర్ ఏం సాధిస్తారనుకోవడం కంటే కూడా అదే ‘పదహారు’ సంఖ్య ప్రభుత్వ ఏర్పాటులో ఎంత కీలకం కానుందో ఊహించుకోవడం అవసరం. డబ్బులు లేదా మరే ఇతర తాయిలాలు తీసుకోకుండా ఓటు వేసే రోజు వస్తే తప్ప జబ్బుపట్టిన ప్రజాస్వామ్య వ్యవస్థకు చికిత్స సాధ్యపడదనే చెప్పాలి.