• ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన అభ్యర్థి

 • సీఎం రమేష్‌ను అడ్డుకున్న వైకాపా ఏజెంట్‌

 • ద్వివేది పోలింగ్‌ కేంద్రంలోనే పనిచేయని ఈవీఎంలు

 • మీడియాపై వైకాపా కార్యకర్తల దౌర్జన్యం

 • దువ్వలో పోలింగ్‌ కేంద్రం వద్ద వ్యక్తి మృతి

 • ఓటరుపై చేయి చేసుకున్న కొడాలి నాని

 • తెదేపా అభ్యర్థిపై వైకాపా కార్యకర్తల దాడి

 • పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ల నిరాకరణ

 • ఓటమి భయంతోనే వైకాపా దౌర్జన్యాలు: సీఎం

 • రాష్ట్ర వ్యాప్తంగా 372 ఈవీఎంల మొరాయించాయి

 • ఈవీఎంలు పనిచేయపోవటంపై సీఎం అసంతృప్తి

 • కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైకాపా నేతల ప్రలోభాలు

 • నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ భారీగా పోలింగ్

 • ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌‌లో హింసాత్మక ఘటనలు

 • పోలింగ్‌బూత్‌కు 150మీటర్ల దూరంలో బాంబు పేలుడు

న్యూఢిల్లీ, అమరావతి, హైదరాబాద్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): తొలి విడత సాధారణ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. లోక్‌సభ సాధారణ ఎన్నికలలో భాగంగా దేశవ్యాప్తంగా తొలి విడతలో 91 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్ర శాసనసభలకూ తొలివిడతలోనే పోలింగ్‌ జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని 175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నితిన్ గడ్కరీ, కిరెన్ రిజిజు, వీకే సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను ప్రభుత్వ వ్యతిరేకత, కులం, అవినీతి వంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్నది అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3.93 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఈ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2,118 మంది, 25 లోక్‌సభ సీట్లకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం స్థానం నుంచి, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బరిలో ఉన్నారు. ఇక ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ పడుతున్నారు.

మరోవైపు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ తొలిదశలోనే పోలింగ్ నిర్వహించారు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ రెట్టించిన ఉత్సాహంతో లోక్‌సభ బరిలోకి దిగింది. తెలంగాణలో మొత్తం 443 మంది పోటీ చేస్తున్నారు. వీరిటో ఒక్క నిజామాబాద్‌లోనే అత్యధికంగా 170 మంది రైతులు సహా 185 మంది బరిలో ఉన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న ప్రముఖుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి (నల్గొండ), కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి (ఖమ్మం), మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్) ఉన్నారు.

ఇక, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8 స్థానాల్లో కొత్తగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీతో కూడిన మహాఘట్‌ బంధన్‌తో బీజేపీ తలపడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఆర్‌ఎల్డీ అధినేత అజిత్‌సింగ్, భాగ్‌పట్‌లో ఆయన కుమారుడు జయంత్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ఘజియాబాద్ నుంచి కేంద్ర మంత్రి వీకేసింగ్, గౌతంబుద్ధనగర్ నుంచి మహేశ్ శర్మ బరిలో ఉన్నారు. మహారాష్ట్రలో పోలింగ్ జరుగనున్న ఏడు స్థానాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ నుంచి, చంద్రాపూర్ నుంచి మరో కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ బరిలో ఉన్నారు. ఇంకా బీహార్‌లోని 4, అరుణాచల్‌ప్రదేశ్‌లోని 2, ఛత్తీస్‌గఢ్‌లోని ఒకటి, అసోంలోని 4 స్థానాలకూ తొలి దశలోనే పోలింగ్ నిర్వహించారు. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాలోని 60 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడి ఓటర్లు నలుగురిని లోక్‌సభకు, 28 మందిని అసెంబ్లీకి ఎన్నుకోనున్నారు.

పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా రెండేసి స్థానాలకు, మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ దీవుల్లోని ఒక్కో సీటుకు తొలిదశలో పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను, అదనపు పోలీసు బలగాలను వినియోగించారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. ముందుగా ఊహించినట్లుగానే తెలుగు రాష్ట్రాలలో స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా వరకు ఈవీఎంలు పోలింగ్ ప్రారంభంలో మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తాయి. యుద్ధప్రాతిపదికన స్పందించిన అధికారులు సాంకేతిక నిపుణుల సహకారంతో మళ్లీ వాటిని వినియోగంలోకి తేవడంతో క్రమంగా ఓటింగ్ ఊపందుకుంది.

ఏపీలో చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ మధ్యాహ్నానికి ఊపందుకుంది. అయితే, ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా ఆశించిన మేరకు పోలింగ్ శాతం నమోదుకాలేదని, రీపోలింగ్‌కు ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని అధికార తెలుగుదేశం విజ్ఞప్తిచేసింది. ఈమేరకు పార్టీ నేతలు గురువారం మధ్యాహ్నం ఆయన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈవీఎంలు ఎంతలా మొరపెట్టాయంటే, చివరికి ద్వివేది ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన కేంద్రంలోని ఈవీఎంలే పనిచేయలేదు. పోలింగ్ సరళిని పరిశీలించిన ఈసీ అధికారులు ఓటరు జాబితాలో పేరుండి, ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈసీ నిర్ధేశించిన 11 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయొచ్చని ప్రకటించింది. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్సు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు జారీ చేసిన పాస్‌పుస్తకాలు (ఫొటో ఉండాలి), ఉపాధి హామీ జాబ్‌కార్డు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డ్‌, ఆధార్‌ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటేయొచ్చని తెలిపింది.

కాగా, తెలంగాణలోని నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఇక్కడ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. మొత్తానికి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాలవైపు వడివడిగా అడుగులు వేశారు. ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుటుంబం ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకుంది. అదే విధంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కడప జిల్లా పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని ఈ సందర్భంగా గవర్నర్‌ పిలుపునిచ్చారు. ‘‘ఓటేయడం మన విధి’’ అని ఆయన అన్నారు. కాగా, మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని చింతమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో చింతమడకకు సీఎం కేసీఆర్‌ దంపతులు వచ్చారు. సీఎం కేసీఆర్‌ వెంట మెదక్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆయన భార్య శైలిమ బంజారాహిల్స్‌ నందినగర్‌లోని జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీ హాల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం ధ్వంసం చేయడాన్ని తప్పుపట్టారు.

అయితే, వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహం చూపారు. ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ‘‘నేను ఓటు వేసాను మీరు కూడా వేయండి’’ అని తన ట్విట్టర్ ద్వారా తారక్ తెలిపారు అల్లు అర్జున్, చిరంజీవి, రామ్‌చరణ్, రాజమౌళి, సుధీర్‌బాబు, ఎంఎం కీరవాణి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు. ఇదిలావుండగా, ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్లలో నియోజకవర్గం పేర్లు సరిగా రాయలేదని ఆగ్రహించిన గుంతకల్‌ జనసేన అభ్యర్థి మధుసూదన్‌గుప్తా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవీఎం యంత్రాన్ని నేలకేసి కొట్టారు.

కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తితో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్తుండగా వైకాపా ఏజెంట్‌ ఒకరు అడ్డుకున్నారు. అంతకముందు, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని 56 కేంద్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఉదయం 5.30 గంటలకు జరగాల్సిన మాక్‌ పోలింగ్‌ 35 కేంద్రాల్లో ప్రారంభం కాకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని సింధువాడ పంచాయతీ పరిధి 181 పోలింగ్‌ కేంద్రంలో ఎంపీ బ్యాలెట్‌ యూనిట్‌కి బ్యాటరీ ఇవ్వకుండా ఈవీఎంను పంపడంతో మాక్‌ పోలింగ్‌ నిలిచిపోయింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పొతంగల్‌లో ఈవీఎంలు మొరాయించడంతో నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి కవిత 40 నిమిషాల పాటు క్యూలైన్లో నిలబడ్డారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఈవీఎంలు సరిగా పనిచేయకపోవటంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంల దుర్వినియోగంపై తాను ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తుచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉంగూరు మండలం కొండారెడ్డిపల్లెలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేట ఉప్పలపాడులో వైకాపా నేతలు, కార్యకర్తల తెదేపా అభ్యర్థి అరవిందబాబుపై దాడి చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఒక ఓటరుపై చేయి చేసుకున్నారు. వైకాపా కార్యకర్తలు నగదు పంపిణీ చేయడంతో వివాదం తలెత్తింది.

విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో దాదాపు 50 శాతానికి పైగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో క్యూలైన్లో నిలబడిన ఓటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు సెల్‌ఫోన్‌తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు అవస్థలు పడ్డారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ను పోలీసులు అనుమతించ లేదు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎల్బీనగర్‌ గణేష్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో నిర్ణీత సమయానికి పోలింగ్‌ ప్రారంభ కాలేదు. విద్యుత్‌ సరఫరా లేక కొవ్వొత్తుల సాయంతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మొత్తానికి ఈవీఎంల మొరాయింపుపై ఎన్నికల అధికారులు ఎట్టకేలకు స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక కారణాలతో 372 ఈవీఎంలు నిలిచిపోయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు.

ఓటర్లు సహనంగా సిబ్బందితో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్థి అరవింద్‌బాబు వాహనంపై దాడి ఘటనను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పలువురి కెమెరాలను ధ్వంసం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలికల ఉన్నత పాఠశాల వద్ద వైకాపా నేతల ప్రలోభాలకు దిగారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఓటర్లకు సంజ్ఞలు చేయడం వివాదంగా మారింది. కాగా, ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయరాజుపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అనంతపురంలో ఈవీఎంలు పనిచేయకపోవడంపై వైకాపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈవీఎంను నేలకేసి కొట్టడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అంతకముందు, కడప జిల్లా జమ్మలమడుగు మండలం పొన్నతోటలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కాశీనాయన మండలం గొంటువారిపల్లె 97వ బూత్‌లో వైకాపా నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పోలింగ్‌ బూత్‌ తలుపులు మూసేసి, ఓటర్లను వెనక్కి పంపేశారు. మరోవైపు, కృష్ణా జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఘోరంగా తయారైంది.

మొదటి రెండు గంటల్లో కేవలం 3 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. పెద్ద సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడిపై దాడి జరిగింది. పోలింగ్‌ కేంద్రం వద్ద వైకాపా అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి తన జులుం ప్రదర్శించారు. విజయనగరం జిల్లా సదానందపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రాలకు తరలించే విషయంలో వివాదం తలెత్తి ఇరు వర్గాలు గొడవ పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమైన సందర్భంగా ప్రముఖ సంస్థ గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి, లక్కిరెడ్డిపల్లెలో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరు దారుణమని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ పెట్టాలని తెదేపా డిమాండ్‌ చేసింది. విజయవాడ జమ్మిచెట్టు సెంటర్‌ వద్ద పోలింగ్‌ కేంద్రాల్లో అయోమయం పరిస్థితి నెలకొంది. ఎవరికి ఓటు వేసినా, భాజపాకే పడుతోందని ఓటర్ల ఆరోపణ. ఇదే విషయంపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో వెళ్లి ఓటు వేశారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన అబిడ్స్‌లోని పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి అంబులెన్స్‌లో వెళ్లారు. ఏపీలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పని చేయకపోవడం, ఒకరికి వేస్తే మరొకరికి ఓట్లు పడటం వంటి అంశాలను తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఉదయం నుంచి 319 ఈవీఎంలను బాగు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది వెల్లడించారు.

మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా కడప జిల్లా గుండాలపల్లెలో పోలింగ్‌ ప్రారంభం కాలేదు. వీవీ ప్యాట్‌ మొరాయించడంతో అధికారులు పోలింగ్‌ను ప్రారంభించలేదు. కాగా, తాజా ఎన్నికలపై ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 30 శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి వచ్చిన ఏపీ శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఆయన చొక్కాను చింపేశారు. పశ్చిమగోదావరి జిల్లా దువ్వలోని 15వ పోలింగ్‌ కేంద్రం వద్ద బండారు ముసలయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ఓటు వేయడానికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నాయకులు చేసిన మూకుమ్మడి దాడిలో తెదేపా నేత సిద్ధా భాస్కర్‌రెడ్డి మృతి చెందాడు.

ఈవీఎంలు సరిగా పనిచేయక పోలింగ్ ప్రక్రియ నిలిచిపోవడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ సరైన చర్యలు చేపట్టకపోవటం వల్లే ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా, న‌క్స‌ల్ ప్ర‌భావిత ప్రాంతాల్లో భారీగా ఓటింగ్ జ‌రిగింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని సుక్మా జిల్లాలో గురువారం ఓట‌ర్లు పోటెత్తారు. జిల్లాలోని ఇంజార‌మ్ గ్రామంలో ఓట‌ర్లు భారీ స్థాయిలో ఓటేసేందుకు సిద్ద‌మ‌య్యారు. ఓ పోలింగ్ బూత్ వ‌ద్ద ఓట‌ర్లు క్యూ క‌ట్టారు. చ‌త్తీస్‌ఘ‌డ్‌లో మొత్తం 11 లోక్‌స‌భ స్థానాలు ఉన్నాయి. వాటి కోసం మూడు ద‌శ‌ల్లో పోలింగ్ నిర్వ‌హిస్తున్నారు. అయితే తొలి ద‌శ‌లోనే సుక్మా జిల్లాలో పోలింగ్ జ‌రుగుతోంది. కాగా, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతి ఆమ్గే (25) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో ఆమె ఓటేశారు.

ఈ సందర్భంగా జ్యోతి ఆమ్గే తాను ఓటేసినట్లు ఓ ఫోటోను తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఓటేసిన తర్వాత మిగతా పనులను చేయండి అని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా జ్యోతి ఆమ్గే గిన్నిస్‌ రికార్డుకెక్కారు. ఈమె ఎత్తు 62.8 సెంటీమీటర్లు మాత్రమే. ఇక, జ్యోతి ఆమ్గే మరుగుజ్జుతనంతో బాధపడటం, తన ఎముకల్లో ఎదుగుదల లేకపోవడంతో తాను ఎత్తు పెరగలేదు. అయితే, తన తక్కువ ఎత్తు వల్ల జ్యోతికి కొన్ని టీవీ షోల్లో ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్, అమెరికన్ హార్రర్ స్టోరీ లాంటి టీవీ షోల్లో జ్యోతి పాల్గొంది.

కాగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌చిలీప‌ట్నంలో పోలింగ్ సిబ్బంది పొర‌పాటు చేశారు. సుమారు 125 ఓట్ల‌ను అనుకోకుండా డిలీట్ చేశారు. మాక్ పోల్‌లో వేసిన ఓట్ల‌ను డిలీట్ చేసే క్ర‌మంలో ఈవీఎంల‌లో ఉన్న 125 ఓట్ల‌ను కూడా డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఓట్లు ర‌ద్దు అయిన విష‌యం తెలుసుకున్న కొంద‌రు ఓట‌ర్లు మ‌ళ్లీ ఓటేశారు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లోక్‌సభ ఎన్నికల భద్రతను అనుక్షణం పర్యవేక్షించామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని తెలిపారు. దాదాపు 85 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేశామని, ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటన జరగలేదని పేర్కొన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా, సజావుగా సాగిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది అన్నారు. 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని, వాటిని మరమ్మతు చేయించామని చెప్పారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఘర్షణలు జరిగాయని, అక్కడ పోలింగ్‌ నెమ్మదిగా కొనసాగిందన్నారు. రాష్ట్రంలో సుమారు 20 చోట్ల ఘర్షణలు జరిగాయని వివరించారు.

ఘర్షణల్లో ఒకరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. ఘర్షణలకు పాల్పడిన అందరిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. కడప జిల్లా ఖాజీపేట మండలం మిడ్తూరులో వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఏపీఎస్ఆ‌ర్టీసీ రీజినల్‌ ఛైర్మన్‌ సుబ్బారెడ్డి కారుపై వైకాపా కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఇదిలావుండగా, సిరాచుక్క పడాల్సిన చోట రక్తం చిందింది. అన్నదమ్ముల్లా మెలిగే గ్రామాల్లో హింస చెలరేగింది. రాళ్లదాడులు, కర్రదాడులు, చొక్కాలు చింపేయడాలు ఇవీ ఏపీలో కొనసాగిన ఎన్నికల ప్రక్రియకు నిదర్శనాలు. రాష్ట్రంలో పలు చోట్ల తెదేపా, వైకాపా వర్గాల మధ్య జరిగిన దాడులతో పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల కర్రలు, రాళ్ల దాడులు జరగడంతో ఒకరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా వర్గీయుల దాడి చేసి చొక్కా చించివేశారు.

పోలింగ్ బూత్‌లోకి కోడెల వెళ్లడంపై వైకాపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. అనంతరం రెండు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో సభాపతి చొక్కాను వైకాపా కార్యకర్తలు చించివేశారు. ఈ క్రమంలో కోడెల సొమ్మసిల్లారు. ఆయన కారు అద్దాలనూ పగలగొట్టారు. అదే విధంగా అనంతపురంలోనూ పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత చింతా భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్‌రెడ్డిని అనంతపురం ఆస్పత్రికి తరలించిన అనంతరం మృతిచెందారు. ఇదే జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్‌ కేంద్రంలోనే తెదేపా, వైకాపా కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అదే మండలం అనప గ్రామంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారు అద్దాలను వైకాపా వర్గీయులు ధ్వంసం చేశారు. దీంతో నాగమౌనిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల వర్గీయులు వాహనాల్లో రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఇదే నియోజకవర్గం అహోబిలంలో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటూ రాళ్లు రువ్వకున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డితో పాటు, స్వతంత్ర్య అభ్యర్ధి కుందూరు రామిరెడ్డి, మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా నాయకుడు, మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్‌బాబు 103 పోలింగ్ బూత్‌లో హల్‌చల్‌ చేశారు.

ఓటు వేసేందుకు లోపలికి వచ్చిన ఆయనను గుర్తింపు కార్డు ఏదని ఏజెంట్ అడగడంతో ఆయన బూతు పురాణం అందుకున్నారు. బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. దీంతో అక్కడకు చేరుకున్న తెదేపా ఏజెంట్లు మంచి పద్ధతి కాదని వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతాపం చూపబోయారు. రామచంద్రాపురం మండలం రాయుల్లవారిపల్లెలో తమకు అనుకూలంగా ఓట్లు వేయడంలేదని గ్రామస్థులపై దుర్భాషలాడారు. దీంతో గ్రామస్థులు చెవిరెడ్డిపై తిరగబడ్డారు. వెంటనే అక్కడి నుంచి చెవిరెడ్డి తిరిగి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలింగ్‌ కేంద్రానికి అత్యంత సమీపంలో ఐఈడీ పేల్చాడు.

అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. గచ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో వాఘేజరీ ప్రాంతంలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి 150 మీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో పోలింగ్‌ కేంద్రం ముందు ఓటర్లు క్యూలైన్‌లో నిల్చుని ఉన్నారు. పేలుడు శబ్దాలతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఘటన జరిగిన ప్రాంతంలో ప్రజలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు.

ఘటనాస్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రజలను భయాందోళనకు గురిచేసి ఎన్నికలకు ఆటంకం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే నక్సల్స్‌ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. గచ్చిరోలితో పాటు మహారాష్ట్రలోని మరో ఆరు లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా నేతలు చేస్తున్న దౌర్జన్యాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖండించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత సిద్దా భాస్కరరెడ్డిపై, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై దాడి, రాప్తాడులో వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతుండడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ఈ దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.

తెదేపా ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు రాకుండా చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సీఎం ఆరోపించారు. ఏం జరిగినా ప్రజలు ఓటుతోనే వైకాపాకు బుద్ధి చెప్పాలని సీఎం పిలుపునిచ్చారు.