ఆందోళనకు దిగిన మహిళా ఓటర్లు

సమస్యలు తలెత్తాయన్న సీఈవో ద్వివేది

విజయవాడ, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): విజయవాడలోని శ్రామిక విద్యాపీఠంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల ఫిర్యాదుతో అధికారులు మూడు సార్లు ఈవీఎంలు మార్చారు. అయినా ఈవీఎంలు పనిచేయకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలు ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

ఈసీ సేమ్ సేమ్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. కాగా, ఈవీఎంలలోని లోపాలను సరిచేశామని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలలో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిచేసిన తర్వాత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందని ఆయన చెప్పారు. ఈవీఎంలు ధ్వంసమైన చోట కొత్తవి పెట్టామని, రాష్ట్రవ్యాప్తంగా 381 ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయని గుర్తించామన్నారు. ఒకరికి ఓటు వేస్తే మరొకరికి పడుతుందనేవి కేవలం వదంతులేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఎన్నికల నిర్వహణలో తాము విఫలమయ్యాయనేది అవాస్తవమన్నారు. 0.30 శాతానికంటే తక్కువగానే ఈవీఎంలు మొరాయించాయని ద్వివేది తెలిపారు. మరోవైపు, ఈవీఎంలు పనిచేయకపోవడంతో మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు.