నల్గొండ, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): అత్యాధునికయుగంలోనూ మూఢనమ్మకాలు బలంగానే పరిఢవిల్లుతున్నాయి. శాష్ట్రసాంకేతి రంగాల్లో దేశం ఎంతో అభివృద్ధి చెందినా మూఢనమ్మకాలు ప్రజలను పట్టిపీడిస్తూనే ఉన్నాయి. మూఢనమ్మకాలను గట్టిగా నమ్మే ఓ తండావాసులు దయ్యం భయంతో ఏకంగా పిల్లల్ని స్కూల్‌కు పంపడం మానేశారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం లచ్చమ్మకుంటక తండాలో ప్రభుత్వ పాఠశాల ఉంది. ఇందులో 22మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అయితే ఈ గ్రామంలో ఓ మహిళ అంతుచిక్కని జబ్బుతో అనారోగ్యం పాలైంది. ఎన్ని ఆస్పత్రుల్లో చూపించినా తగ్గలేదు. ఇంతలో మరో వ్యక్తి ఇలాంటి లక్షణాలతో కనిపించాడు. వీరిద్దరికీ దయ్యం పట్టిందని, అందువల్లే జబ్బు తగ్గడంలేదని ఊర్లో ప్రచారం జరిగింది.

అటు స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు సమాధుల పక్కనుండి నడవాలి. ఈ సమయంలో తమ చిన్నారులకు ఎక్కడ దయ్యం పడుతుందోనని గ్రామస్తులు భయపడ్డారు. మొత్తం పిల్లల్ని పాఠశాలకు పంపడం మానేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈవో గ్రామస్తులకు కౌన్సిలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.