కర్నూలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే నిర్మాణ పనుల్లో మరింత వేగం పుంజుకుంది. ఎర్రగుంట్ల నుంచి బనగానపల్లి మండలంలోని నందివర్గం వరకు రైల్వే మార్గ నిర్మాణం పూర్తి చేశారు. బనగానపల్లిలోని రైల్వే స్టేషన్‌ పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి. రైలుపట్టాలు పటిష్టం చేయడానికి రెండురోజుల నుంచి ప్రత్యేక ఇంజిన్‌ సాయంతో పట్టాల మధ్యన కంకర నింపే పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పాణ్యం మండలంలో మిగిలి ఉన్న 12 కిలోమీటర్ల మేర పనులు వేగం పుంజుకున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

త్వరలోనే రైలు తిప్పాలని నిర్ణయించినా పాణ్యం మండలంలో పనులు పూర్తికాకపోవడంతో సాధ్యం కాలేదన్నారు. మరో నెలరోజుల్లో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇదిలావుండగా, డోన్‌ మండలంలోని జాతీయ రహదారి నుంచి మల్యాల పొగబండి ప్రాంగణానికి (రైల్వే స్టేషన్‌) వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. జాతీయ రహదారి నుంచి ఓబులాపురం, యాపదిన్నె, మల్యాల పొగబండి ప్రాంగణం మీదుగా కటారుకొండ, లక్కసాగరం మీదుగా పత్తికొండకు రహదారి వెళ్తుంది.

ఈ రహదారిలో ఓబులాపురం నుంచి మల్యాల వరకు రహదారి పూర్తి గుంతల మయంగా మారింది. పలు ప్రాంతాల్లో రహదారి శిథిలమైంది. వంద గజాల వరకు పైగా రహదారి దెబ్బతింది. అక్రమంగా అధిక బరువుతో వాహనాలు తిరగడంతోనే దెబ్బతిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రహదారిని బాగుచేయాలని కోరారు.