ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌’ షేర్లు గురువారం మార్కెట్లో నమోదు (లిస్ట్) అయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఇవి 4.21 శాతం ఎగసి 19.80కు చేరాయి. బీఎస్ఈలో అయితే ఏకంగా 3.94 శాతం పెరిగి రూ.19.75కు చేరాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌’ షేర్లను రూ.17-19 మధ్య ధరతో మార్చి 29-ఏప్రిల్‌ 3 వరకు పబ్లిక్‌ ఇష్యూ కింద బిడ్లను స్వీకరించారు. ఇది 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయింది. ఈ ఐపీవో నుంచి ‘రైల్‌ వికాస్ నిగమ్‌ లిమిటెడ్‌’ రూ.482 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవోలో ప్రభుత్వం 12.12 శాతం వాటాను విక్రయించింది.

2018 నాటికి ‘రైల్‌ వికాస్‌ నిగమ్‌’కు రూ.77,504 కోట్లు విలువైన ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. ఈ సంస్థ కొత్త ట్రాక్‌లు వేయడం, రైల్వే విద్యుదీకరణ, మెట్రోపాలిటిన్‌ రవాణ వ్యవస్థలు, వర్క్‌షాపుల, వంతెనల నిర్మాణం చేపడుతుంది. ఇదిలావుండగా, తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన వేళ దేశీయ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 38,585 వద్ద కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ 17 పాయింట్లు లాభపడి 11,601 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 69.14 వద్ద కొనసాగింది.

ఐవోసీ, విప్రో, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, యెస్‌ బ్యాంక్‌, హీరో మోటార్‌ కార్ప్‌ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగగా, సన్‌ ఫార్మా, వేదాంత, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, సిప్లా, హిందాల్కో, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. మరోవైపు, మహీంద్రా అండ్‌ మహీంద్రాతో కలిసి భారత్‌లో కొత్త జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేసే దిశగా ఫోర్డ్‌ మోటార్‌ కో ఆలోచిస్తోంది. ఇది పూర్తిగా కార్యరూపం దాలిస్తే ఫోర్డ్‌ ఇండియా భారత్‌లో స్వతంత్రగా కార్యకలాపాలను చేపట్టకపోవచ్చు. ఈ డీల్‌తో కొత్త ఆటోమొబైల్‌ తయారీ సంస్థగా భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది.

ఇప్పటికే అమెరికాకు చెందిన జనరల్‌ మోటార్స్ 2017 చివర్లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రధాని మేకిన్‌ ఇండియాను ఎదురుదెబ్బగా అభివర్ణించారు. మిషిగాన్‌కు చెందిన ఫోర్డ్‌ సంస్థ భారత్‌లో రెండు దశబ్దాల క్రితమే అడుగు పెట్టింది. ఇక్కడ దాదాపు 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. అయినా కానీ మార్కెట్లో నిలదొక్కుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. విశాలమైన భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో మూడుశాతం వాటాతో సర్దుకొంది. దీంతో మహీంద్రాతో జట్టుకట్టేందుకు ఫోర్డు సిద్ధమైపోయింది. కొత్త డీల్‌ ప్రకారం ఫోర్డు భారత్‌లో ఒక యూనిట్‌ను నెలకొల్పుతుంది. దీనిలో 49 శాతం వాటా ఫోర్డుకు, 51 శాతం వాటా మహీంద్రాకు ఉంటుంది. ఫోర్డుకు భారత్‌లో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కొత్త సంస్థకు మళ్లించేస్తుంది. ఫోర్డు ఆస్తులు, ఉద్యోగులను కొత్త సంస్థకు అందజేస్తుంది.

ఒక ముక్కలో చెప్పాలంటే తాత్కాలికంగా ఫోర్డు భారత మార్కెట్‌ నుంచి తప్పుకొంటుంది. ఈ కొత్త డీల్‌ మరో 90 రోజుల్లో పూర్తికావచ్చని సమాచారం. ఈ సమాచారంపై వ్యాఖ్యానించేందుకు ఫోర్డు యాజమాన్యం అంగీకరించలేదు. కానీ రెండు కంపెనీలు మాత్రం ‘వాణిజ్య, తయారీ సామర్థ్యాలను పెంచుకొనేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాత్మక సహకారం ఉంటుంది’ అని వెల్లడించాయి. 2017లో ఫోర్డు మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకొంది. దీనికింద కొత్త కార్ల తయారీ, ఎస్‌యూవీల తయారీ, ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ చేయాలని నిర్ణయించుకొన్నాయి.

ఫోర్డ్‌ ఇండియా మాతృ సంస్థ ఫోర్డు ప్రపంచ వ్యాప్తంగా కార్యకలాపాల నుంచి వచ్చే ఐదేళ్లలో 11 బిలియన్‌ డాలర్ల వ్యయాన్ని తగ్గంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. గత నెలలో రష్యాలోని ఫోర్డు జాయింట్‌ వెంచర్‌ అక్కడి రెండు అసెంబ్లీ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మార్కెట్‌ నుంచి వైదొలగుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్లమార్కెట్లలో భారత్‌ ఒకటి. కాకపోతే ఇటీవల కాలంలో ఇక్కడ కార్ల విక్రయాలు 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గాయి. 2023 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఎదగనుంది.

ఇక్కడ వార్షిక విక్రయాలు కూడా 5 మిలియన్లను దాటనున్నాయి. ఈ మార్కెట్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌లే రాజ్యమేలుతున్నాయి. మారుతీ సుజుకీ దాదాపు 51శాతం వాటా కైవశం చేసుకొంది. అతిపెద్ద డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌, స్వతంత్ర లోకల్‌ టీమ్‌లు దానికి కలిసి వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఫోర్డ్‌-మహీంద్రాల డీల్‌తో ఈ సంస్థలు కూడా కొత్తమోడళ్లను అతితక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం కలిగింది.