మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో అరుదైన వెన్నుముక శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు పాలమూరు జిల్లా ఆసుపత్రి సూపరిటెండెంట్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యనిపుణుడు డాక్టర్ రాంకిషన్ తెలిపారు. శస్త్రచికిత్స ఆనంతరం వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ మండలంలోని జైనల్లీపూర్, తువ్వగడ్డతండాకు చెందిన ఆర్. దేవేందర్ అనే యువకుడు ఈనెల 1న తీవ్ర నడుము నొప్పితో బాధపడుతూ జనరల్ హాస్పిటల్‌ వైద్యులను సంప్రదించారు.

పరీక్షించిన ఆర్థోపెడిక్ వైద్యులు ఎల్4, ఎల్5 డిస్క్ ప్రొలాప్స్ అనే అరుదైన వెన్నెముక వ్యాధి ఉందని గుర్తించారు. దీనికి సంబంధించిన లామినాటమి, డిస్కెక్షమి అనే ఆపరేషన్ చేశారు. శస్త్రచికిత్స విజయంతంగా ముగియడంతో ప్రస్తుతం ఆ రోగి కోలుకొని నడుస్తున్నందున త్వరగా డిస్చార్జ్ చేశారు.

ఈ విషయమై రోగి బంధువులు స్పందిస్తూ చాలాకాలంగా దేవేందర్ ఈ నొప్పితో బాధపడుతున్నాడని, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు తిరిగినా ఆపరేషన్ చేయలేక హైదరాబాద్‌కు రిఫర్ చేశారని, ఈ ఆపరేషన్‌కు సుమారు లక్ష రూపాయాలు ఖర్చు అయ్యేదనీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి అత్యాధునిక వైద్య సేవలను రోగులకు ఉచితంగా సాధారణ ఆసుపత్రిలో అందిస్తున్నామని, ప్రజలు వినియోగించుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ కోరారు. ఈ ఆపరేషన్‌ను సూపరింటెండెంట్ రాంకిషన్, హెచ్‌వోడీ ఆఫ్ ఆర్థోపేడిక్ డాక్టర్ నర్సింహరావు, ఆసోసియేట్ డాక్టర్ అంకిత్, డాక్టర్ మీర్జా, ఓటి హెడ్‌నర్సు ఖమృనిస్స, విజయలక్ష్మీ నిర్వహించారు.