కర్నూలు, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): బిరబిర పరుగులిడాల్సిన కృష్ణానది నీరులేక వెలవెలబోతోంది. గత దశాబ్దాన్నర కాలంలో ఏనాడు కూడాఈ పరిస్థితిని ఎదుర్కోలేదు. ఈ ఏడాది తక్కువ స్థాయిలో వర్షాపాతం నమోదు కావడంతో గతేడాది జూలై నుంచి నవంబరు వరకు 58 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలాశయానికి చేరాయి. ఈ అరకొర నీటిని నిల్వ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తాగు నీటి అవసరాల పేరుతో తెలంగాణకు, కోస్తా ప్రాంతాలకు తరలించారు. రాయలసీమకు మాత్రం చుక్క నీటిని వదలలేదు.

దీనిపై అప్పట్లోనే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతు సంఘాలు, ఇతర పార్టీలు ఆందోళనలు చేసినా ఈ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ రోజుకు కూడా కృష్ణాడెల్టాలో తాగు నీటి ఇబ్బందులు రాయలసీమ కంటే తక్కువగానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంత ప్రజలు ఓట్లు వేశారనే ప్రేమతోనో లేక రాయలసీమ వాసులు తమ పార్టీని ఆదరించలేదనే కోపంతోనో ఇప్పటికీ కూడా డెడ్‌స్టోరేజ్‌కి చేరిన శ్రీశైలం జలాశయం నుంచి తాగు నీటి కోసమని దిగువకు నీటిని తీసుకెళ్తున్నారు.

గత దశాబ్దాన్నర కాలంలో ఇంత దిగువ వరకు నీటిని వాడుకోలేదని అధికార గణాంకాలే చెబుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్థి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు సామర్థ్యం. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో జలాశయంలోకి నీటి చేరికలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా మే చివరికి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరుకునేది. అయితే తక్కువ వర్షపాతంతో మార్చి మొదటి వారానికే డెడ్ స్టోరేజీకి చేరుకుంది. అయినా, నీటిని తాగు నీటి పేరుతో నాగర్జున సాగర్‌కు తీసుకుపోతున్నారు.

ఇలా తీసుకెళ్లడంతో ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయి నల్లమల అడవుల్లోని వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుంది. ఇదే అభిప్రాయంతో కొందరు పర్యావరణవేత్తలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here