ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి

ముంబయి, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): లోక్‌సభ సాధారణ ఎన్నికల పండుగ ఒకే గ్రామానికి చెందిన మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా శంకర్‌పూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్దారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలావుండగా, ఉత్తరప్రదేశ్‌ షామ్లీ జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద కొంత మంది ఓటర్లు గుర్తింపు కార్డు లేకుండా ఓటేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఎస్‌ఎఫ్‌ బలగాలతోనూ గొడవ పడ్డారు. దీంతో పరిస్థితి అదుపుతప్పడంతో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన అనంతరం పోలింగ్‌ ప్రక్రియను మళ్లీ ప్రారంభించారు.