న్యూఢిల్లీ, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): ఎన్నికలనగానే ఎదురయ్యే ప్రశ్న ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇవన్నీ చెప్పే సర్వే సంస్థలే చాలానే ఉన్నాయి. అయితే, అవి చెప్పే జోస్యం కొన్నిసార్లు నిజమవుతూ కూడా ఉంటుంది. అందుకే ఎగ్జిట్‌ పోల్స్‌పై పోటీదారులు పూర్తిగా ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఈసారి కూడా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎగ్జిట్ పోల్స్‌పై ఆంక్షలు విధించింది. వచ్చే నెల 19వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల్లో ఫలానా పార్టీకి ఇన్ని సీట్లలో మెజారిటీ వస్తుందని ప్రచారం చేయడం, ప్రచురించడంపై ఆంక్షలు కొనసాగుతాయని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. ఏప్రిల్‌ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 91 ఎంపీ స్థానాలకు సాధారణ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల విధాన సభలకూ ఈ దశలోనే ఎన్నికలు జరిగాయి.

ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాల్లోనూ చివరిదశ మే 19 వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది. పత్రికలు, వార్తా ఛానెళ్లతో పాటు సామాజిక మాధ్యమాల్లో (సోషల్ మీడియాలో)నూ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించకూడదు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ ముఖ్య కార్యదర్శి కేఎఫ్‌ విల్‌ఫ్రెడ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదిలావుండగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 11న చోటుచేసుకున్న ఘర్షణాత్మక పరిణామాల నేపథ్యంలో రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాకు తెలిపారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 244 నంబరు పోలింగ్‌ కేంద్రం, నరసరావుపేట నియోజకవర్గంలోని 94వ నంబరు పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. వాటిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. ఈసీఐ ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి సేవలు ప్రశంసనీయమని ద్వివేది అన్నారు. ప్రశాంతంగా నిర్వహించటంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు. ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.