సుల్తాన్‌పూర్‌, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): అధికార భారతీయ జనతా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి మేనకా గాంధీకి సుల్తాన్‌పూర్‌ జిల్లా మేజిస్ట్రేటు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సుల్తాన్‌పూర్‌లో ముస్లిం సోదరులతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఈ నోటీసులు జారీ చేసినట్లు ఎన్నికల అధికారి హోదాలో తెలిపారు.

ఈ మేరకు ఆమె మాట్లాడిన వీడియోను క్షుణ్ణంగా పరిశీలించిన జిల్లా మేజిస్ట్రేటు ఈ ఘటనపై పూర్తి నివేదికను ఈసీకి సమర్పించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనకాగాంధీ భాజపా నియోజకవర్గ మైనారిటీ సెల్‌తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆమె ‘‘నేను గెలవడం ఖాయం. ముస్లింల మద్దతు లేకుండా గెలిస్తే విజయానికి అర్థం ఉండదు. ఇక అప్పుడు ఏదైనా పని చూపించమని ఎవరైనా ముస్లిం సోదరులు నా దగ్గరకు వస్తే నేను పట్టించుకోను’’ అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ విషయం కాస్త కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది.

అనంతరం ఈ వివాదంపై స్పందించిన ఆమె తాను ముస్లిం సోదరులను ఎంతో ఆదరిస్తానని, తన విజయంలో వారి పాత్ర ఉండాలన్న సదుద్దేశంతోనే అలా అన్నానని వెల్లడించారు. మొత్తానికి ఈ వ్యవహారం బీజేపీని ఇరుకునపెడుతుందని తొలుత పార్టీ వర్గాలు భావించినప్పటికీ మేనకాగాంధీ వివరణ ఆయా వర్గాలను ఊపిరిపీల్చుకునేలా చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here