• గట్టి పోటీలో వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి

  • కల్యాణ్‌కు వ్యతిరేక పవనమేనా?

  • చల్లబడిపోయిన పల్లా శిబిరం

విశాఖపట్నం, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): పారిశ్రామిక ముఖద్వారం గాజువాక నియోజకవర్గం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గం కూడా ఇదే. జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇక్కడినుంచి పోటీ చేయడమే దీనికి ప్రధాన కారణం. ఎన్నికల ముందునుంచీ ఈ నియోజకవర్గంపై అందరి దృష్టీ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ గెలుపోటములే హాట్ టాపిక్‌గా మారాయి. 12 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్డారు. ఇక్కడ పోలింగ్ సరళి ఉత్కంఠభరితంగా సాగడం, వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గట్టి పోటీలో ఉండటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఆ రెండు ఎన్నికల్లోనూ ఓడిపోచారు. దీంతో సానుభూతి అస్త్రాన్ని ఉపయోగించారు. వయస్సు పెద్దది కావడం, ఐదేళ్ల తరువాత తాను పోటీ చేసే పరిస్థితి ఉండదని ఓటర్లకు చెబుతూ వచ్చారు. దీంతోపాటు స్థానికతను, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి విషయాలను ప్రచారం చేస్తూ అనూహ్యంగా గట్టి పోటీలో నిలబడ్డారు. నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వ్యూహాత్మకంగా ముందుకు సాగారు.

సానుభూతి అస్త్రాన్ని గట్టిగా ఉపయోగించారు. జగన్ వేవ్ కూడా దీనికి అదనంగా తోడవడంతో నాగిరెడ్డి శిబిరంలో జోష్‌కు తెరలేపింది. పవన్ కల్యాణ్‌కు మాత్రం గాజువాకలో సరైన ప్రచారం చేసుకోలేకపోయారు. నామినేషన్ వేసిన తరువాత మధ్యలో ఒకసారి, ఎన్నిలక ప్రచారం ముగియడానికి ఒకరోజు ముందు తప్ప మిగిలిన సమయాల్లో ఇక్కడ కనిపించలేదు. ఆయన ఇక్కడ ప్రచారం చేయడానికి సమయం కేటాయించకపోవడం కూడా ఆయనకు ప్రతికూలంగా మారింది. ఆయన గెలిస్తే ఇక్కడ అందుబాటులో ఉండరన్న విషయాన్ని ప్రత్యర్థులు గట్టిగా ప్రచారం చేశారు. ఒకానొక సమయంలో పవన్ కల్యాణ్ ఇక్కడ పోటీలో ఉన్నారా అనే సందేహం కూడా ఇక్కడ ఓటర్లలో వ్యక్తమైంది.

ఈ అనుమానాలను నివృత్తి చేస్తే జనసేన పార్టీ నాయకత్వం నియోజకవర్గంలో లేకపోవడం కూడా పవన్‌కు ప్రతికూలంగా మారినట్టు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలో పరిస్థితిని పరిశీలించడానికి కూడా ఆయన ఇక్కడికి రాకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు శిబిరం ఎన్నికల తరువాత చల్లబడిపోయింది. ఆయన గత ఎన్నికల్లో పలు హామీలను ఇచ్చి గెలుపొందారు. అందులో ప్రధాన హామీలు పూర్తిస్థాయిలో నెరవేరకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సెటిల్‌మెంట్ల బ్యాచ్‌లకు ప్రాధాన్యతనిస్తూ సీనియర్లను పక్కన పెట్టారనే ఆరోపణలతో చాలామంది సీనియర్ నాయకులు ఎన్నికలకు ముందుగానే టీడీపీని వీడారు.

మరికొంతమంది ఆ పార్టీలో కొనసాగుతూనే శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా పని చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో గాజువాక ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల దృష్టినీ ఆకర్షించింది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే వచ్చేనెల 23వ తేదీ వరకు వేచి చూడకతప్పదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.