• మరింత అందంగా క‌నిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు

  • త‌న్మ‌య‌త్వానికి లోన‌వుతున్న తిరుమలేశుని భ‌క్తులు

తిరుమల, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): చ‌క్క‌టి శిల్ప‌క‌ళ శ్రీ‌వారి ఆల‌యం సొంతం. ఆల‌యంలోని ప‌లు మండ‌పాల్లో ద‌శావ‌తారాల‌కు సంబంధించిన ప‌లు దేవ‌తామూర్తుల శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాల‌ను భ‌క్తులు తిల‌కించి త‌రించేలా టిటిడి ఇటీవ‌ల ఏర్పాట్లు చేప‌ట్టింది. ఈ శిల్ప క‌ళ‌ను ద‌ర్శిస్తున్న భ‌క్తులు త‌న్మ‌య‌త్వానికి లోన‌వుతున్నారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ ఆలోచ‌న మేరకు ఆల‌యంలో శిల్పాలు మ‌రింత బాగా క‌నిపించేలా ఏర్పాట్లు చేప‌ట్టారు. ముందుగా రంగనాయకుల మండపంలో శిల్పాలు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ప్ర‌త్యేకమైన లైట్లతో అలంకరించారు. ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులురెడ్డి విరాళంతో శ్రీవారి ఆలయంలో ఈ లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సెప్టెంబ‌రులో జ‌రిగిన శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో ఈ శిల్పాల విద్యుత్ అలంక‌ర‌ణ ప‌నుల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించారు.

న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఈ ప‌నుల‌ను పూర్తిస్థాయిలో చేప‌ట్టారు. పురాత‌న శిల్ప‌క‌ళ మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా ఉండేందుకు ఇటీవ‌ల త‌మిళ‌నాడుకు చెందిన నిపుణుల బృందంతో హెర్బ‌ల్ క్లీనింగ్‌ (ఔష‌ధీ శుద్ధి) చేశారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో సింహం ఆకృతిలో యాళి, మోహిని, వ‌ట‌ప‌త్ర‌శాయి, తాండ‌వ‌కృష్ణ‌, సంజీవ‌నితో హ‌నుమంతుడు, ల‌క్ష్మీనారాయ‌ణుడు, త్రిముఖ బ్ర‌హ్మ‌, స‌ర‌స్వ‌తి దేవి, యోగ‌న‌ర‌సింహుని శిల్పాలున్నాయి. ఇదిలా ఉండ‌గా యాగ‌శాల అద్భుత‌మైన శిల్పాల‌తో అల‌రారుతోంది. ఇక్క‌డ గ‌ల ప్ర‌త్యేక మండ‌పంలో పూర్వ‌పు రోజుల్లో ఊంజ‌ల్ సేవ చేసిన‌ట్టు కొక్కెం గుర్తులు ఉన్నాయి. యాగ‌శాల‌లో క‌ల్కి, త్రివిక్ర‌ముడు – వామ‌నావ‌తారం, కిష్కింద‌కాండ‌, దాన‌వుల శిల్పాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌త్యేక ఊంజ‌ల్ మండ‌పంలో శ్రీ స‌త్య‌భామ‌, రుక్మిణి స‌మేత శ్రీకృష్ణ‌స్వామి, శ్రీ స‌త్య‌భామ‌, రుక్మిణి స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారి శిల్పాలు ఉన్నాయి.

యాగ‌శాల‌లో ఊంజ‌ల్ మండ‌పం ఎదురుగా గ‌ల మ‌రో మండ‌పంలో శ్రీ గోవింద‌రాజ‌స్వామి, శ్రీ సీతారాములు, వాలి సుగ్రీవుల యుద్ధం, గ‌రుడ శిల్పాలు కొలువున్నాయి. అద్దాల మండ‌పంలో య‌శోధ కృష్ణుడు, గ‌రుడ ఇత‌ర దేవ‌తామూర్తుల శిల్పాలున్నాయి. యాగ‌శాల‌లోని శిల్ప‌క‌ళ‌ను చూసి చాలా ఆనందం క‌లిగింద‌ని త‌మిళ‌నాడులోని మాయావ‌రానికి చెందిన తంబిదైరై అనే భ‌క్తుడు తెలిపారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ద‌ర్శ‌నానికి వ‌స్తున్నాన‌ని, ఇక్క‌డ గాజు అద్దాల్లో ప‌ర‌కామ‌ణి లెక్కించేవార‌ని చెప్పారు. అద్దాల‌ను తొల‌గించ‌డం వ‌ల్ల మండ‌పంలోని గోడ‌ల‌పై త్రివిక్ర‌ముడు, క‌ల్కి, యాళి త‌దిత‌ర దేవ‌తామూర్తుల చ‌క్క‌టి శిల్పాల‌ను చూడ‌గ‌లుగుతున్నాన‌ని వివ‌రించారు.

అదేవిధంగా మైసూరుకు చెందిన ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని మైథిలి మాట్లాడుతూ గ‌తంలో ఊంజ‌ల్‌సేవ ఇక్క‌డి యాగ‌శాల‌లోని మండ‌పంలో జ‌రిగేద‌ని త‌న నాన‌మ్మ చెప్పేద‌న్నారు. ఇప్ప‌టికీ ఇక్క‌డ ఇనుప కొక్కెం ఉండ‌డాన్ని గ‌మ‌నించాన‌ని, చాలా ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆల‌య పురాత‌న శిల్ప సంప‌ద‌ను చూసే అవ‌కాశం క‌ల్పించినందుకు టీటీడీకి తెలియ‌జేస్తున్నాన‌న్నారు.