• ఊపేస్తున్న జగన్ ‘ఒక్కఛాన్స్’

  • చంద్రబాబులో ఓటమి భయం!

  • పవన్ కల్యాణ్‌ని కమ్మిన నైరాశ్యం

అమరావతి, ఏప్రిల్ 13 (న్యూస్‌టైమ్): పోలింగ్‌ ముగిసింది. ప్రజలు హ్యాపీ. ప్రతి పక్షనాయకుడు వైఎస్ జగన్ మరీ హ్యాపీగా ఉన్నారు. ఆయన ఏడాది కాలంగా ప్రజలను అడుగుతూ వస్తున్న ‘ఒక్కఛాన్స్’ నినాదం ఇప్పుడు రాష్ట్రాన్ని ఊపేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ‘ఒక్కఛాన్స్’ నినాదం మార్మోగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు జగన్‌కు అనుభవం లేదని, ఆయన వస్తే అరాచకాలు పెరుగుతాయని, అభివృద్ధి కుంటుపడుతుందన్నప్రచారాన్ని ప్రజలను మెప్పించలేకపోయినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో జగన్ పేర్కొన్న కరువు, బాబు బినామీల ఆగడాలు ప్రజలను ఆలోచింప చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజదాని ప్రాంతాల్లో కూడా ప్రజలను భ్రమలో ఉంచి ప్రభుత్వం రియల్టర్‌గా వ్యవహరిస్తోందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ప్రభుత్వంపై భ్రమలు తొలగినట్టుగా స్పష్టమవుతోంది. ప్రజాప్రతినిధులు కూడ ప్రజా సేవ మరచి వ్యాపార దృక్పథంతో కార్యకర్తలను వదలి పార్టీని ఫణంగా పెట్టారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

ఎన్నికలకు ముందుగాని, ఎన్నిలకు తరువాతగాని జరిగిన సర్వేలు జగన్‌కు అనుకూలంగా వెలువడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 125 సీట్లను జగన్ పార్టీ గెలుచుకొంటుందని జాతీయ మీడియాకు చెందిన సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వైసీపీకి 109 సీట్లు వస్తాయని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంయమనం కోల్పోవడం, తాను ఢిల్లీలో పోరాడతానంటూ ప్రకటనలు చేయడం కూడా ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ విజయావకాశాలను స్పష్టం చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి జగన్ నినాదం ‘ఒక్కఛాన్స్’ విజయవంతంగా ప్రజల్లోకి వెళ్లడంతో మంచి ఫలితాలు సాధిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here