ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోనే కాకుండా భారతదేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లాలో నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అనేక పర్యాయాలు దేశరాజకీయాలలో చక్రం తిప్పి తనదైన ఉనికిని చాటిచెప్పాడు. సమితి స్థాయిలో యువజన అధ్యక్షపదవితో రాజకీయజీవితం ఆరంభించిన చంద్రబాబు అంచెలంచెలుగా ఎదిగి శాసనసభ్యుడిగా, తొలిసారిగా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో స్థానం పొంది తదుపరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించే వరకు అతని జీవితంలో ఎన్నో ఆటుపోట్లు సంభవించాయి.

తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 1982లో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగానే ఉన్నాడు. మామను తీవ్రంగా విమర్శించి కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం జయభేరి మ్రోగించాక తెలుగుదేశం పార్టీ లోకి చేరినాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది.

1950లో అమ్మణమ్మ, ఖర్జూరనాయుడు దంపతులకు పెద్ద కుమారుడిగా జన్మించిన చంద్రబాబు నాయుడు ప్రాథమిక విద్యాభ్యాస సమయంలో రోజూ పొరుగు గ్రామ మైన శేషాపురంకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. ప్రాథమిక విద్య అనంతరం చంద్రగిరిలోని జిల్లాపరిషత్తు పాఠశాలలో చేరి ఉన్నత విద్యను పూర్తిచేశాడు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ పట్ల అత్యంత ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించిననూ ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైనవని నిర్థారించి రాజకీయాలపై దృష్టిపెట్టాడు. విద్యాభాసం పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీలో చేరినాడు.

చదువుతున్నప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను మరికొందరిని కూడగట్టుకుని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రతిభ రాజకీయ వ్యుహచతురత బయటపడింది. తరువాత శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీచేయాలని ఆసక్తి చూపి నామినేషన్ వేసిననూ స్థానిక నేతల కారణంగా విరమించుకోవలసి వచ్చింది. ఆ తరువాత చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కొంతకాలం రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‍గా పనిచేశాడు. 1980 నుండి 1983 వరకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ, చిన్నతరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పని చేశాడు.

కాంగ్రెస్ మంత్రివర్గంలో ఉన్నప్పుడే ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరామారావు కుమార్తె అయిన భువనేశ్వరీ దేవిని 1981, సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. 1983లో ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు. కానీ తరువాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేశాడు.

1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడంతో నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రిగా తప్ప ప్రతిపక్ష నాయకునిగా శాసనసభలో అడుగు పెట్టనని ‘ ప్రతిజ్ఞ ‘ చేయడంతో చంద్రబాబు నాయుడు శాసనసభలో తెలుగుదేశం తరుపున ప్రతిపక్షనాయకునిగా వ్యవరించాడు. ఆ అవకాశం పార్టీపై పట్టు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడికి చాల బాగా ఉపయోగపడింది. 1994వ సంవత్సరంలో తెలుగుదేశం భారీ విజయం సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. అప్పుడు ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.అప్పుడు జరిగిన ఎన్నికలలో కుప్పం నుండి ఎన్నికై ప్రభుత్వంలో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా చంద్రబాబు నాయుడు పని చేసాడు.

1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం”(4 సం” రామారావు గారి ని ప్రజలు ఎన్నుకున్నది + 5 సం” చంద్రబాబు ని ప్రజలు ఎన్నుకున్నది ) చరిత్ర సృష్టించాడు. జన్మభూమి, నీరు-మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం-పరిశుభ్రత, ఆదరణ వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాడు. “ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ” సహకారంతో ఆంధ్ర ప్రదేశ్‍ను ఆధునికదిశగా అడుగు వేయించాడు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషికి బిల్‍క్లింటన్, బిల్‍గేట్స్ వంటివారి ప్రశంసలు అందుకున్నాడు. దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణేతగా కొంతకాలంపాటు కీలకపాత్ర పోషించాడు. ఆ సమయాల్లో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికే అంకితమవుతాని ప్రకటించి, రాష్ట్రానికే పరిమితమయ్యాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాడు.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చివేసి, పరిపాలనా రంగానికి హైటెక్ సొగసులద్దిన చంద్రబాబు నాయుడును అందరూ హైటెక్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. చంద్రబాబు నాయుడు ప్రవేశంతో పరిపాలనా విధానంలో వేగం పెరిగింది. ఇన్ని చేసినప్పటికీ వ్యవసాయరంగం, సాగునీటి పారుదల వంటి ప్రధాన రంగాలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, ఆ రంగాలు నష్టపోయాయని పలువురు విమర్శిస్తుంటారు. చంద్రబాబు నాయుడు పదవీకాలంలోనే వరదలు, కరువు రెండూ సంభవించడంతో వ్యవసాయరంగం భారీగా నష్టపోయింది. 1999వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, 2004వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారాన్ని కోల్పోయాడు. తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కావడం, పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగడం వల్ల చంద్రబాబు సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

అనంతరం ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలుపొందారు. ఆసారి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రజలు అనుభవానికి పట్టం కట్టడంతో చంద్రబాబునే ముఖ్యమంత్రి పదవి వరించింది.

2003వ సంవత్సరంలో తిరుపతి బ్రహ్మొత్సవాలకు వెళుతున్న సమయంలో అలిపిరి వద్ద నక్సలైట్లు క్లేమోర్ మైన్లు పేల్చి చంద్రబాబునాయుడిపై హత్యాప్రయత్నం చేశారు. కానీ అదృష్టవశాత్తూ చంద్రబాబు ఆ ప్రమాదం నుండి గాయాలతో బయటపడ్డాడు. తర్వాత జరిగిన మధ్యన్థర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది.