భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఇక అన్ని ఆన్‌లైన్‌లోనే భక్తులకు సేవలు అందనున్నాయి. ఈ మేరకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తాళ్లూరి రమేష్‌బాబు ఇందుకు సంబంధించిన కసరత్తు నిర్వహిస్తున్నారు. భద్రాచలం దివ్యక్షేత్రం దక్షిణ అయోధ్యపురిగా భాసిల్లుతోంది. ప్రపంచ పుణ్యక్షేత్రంగా ఉన్న రామక్షేత్రంకు దేశ నలుమూలల నుంచి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. ఈ క్రమంలో భక్తులకు కొంత ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్జిత సేవలు, వసతి సౌకర్యం తదితర వాటిలలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఇక ఆన్‌లైన్‌లో అన్ని రకాల సేవలు అందించాలని దేవస్థానం నిర్ణయించింది. స్వామివారికి చేసే అభిషేక టిక్కెట్లు, శాశ్వత సేవల రుసుమలు, నిత్యసేవల రుసుములు, అన్నదానం తదితర వాటితో పాటు దేవస్థానంకు సంబంధించిన కాటేజీలు, రూమ్‌లు భక్తులు పొందాలంటే ఆన్‌లైన్‌లో సేవలను వినియోగించుకోవచ్చు. దీంతో దేవస్థానం ఎకౌంట్‌లోకి నేరుగా నగదు వచ్చి చేరుతోంది. ఇక నుంచి మ్యానివల్ టిక్కెట్లు లభించవు. కంప్యూటరీకరణ చేసి టిక్కెట్లను కూడా కంప్యూటర్ టిక్కెట్లను దేవస్థానం అందజేయనుంది. స్వైప్ ద్వారా కూడా నగదు చెల్లించవచ్చు. ఇందుకోసం దేవస్థానం ప్రత్యేక కంప్యూటర్ పరికరాలను కొనుగోలు చేసింది.