విశాఖపట్నం, ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు మేరకు జిల్లాలోని అన్ని ప్రయివేటు విద్యా సంస్థలు తప్పనిసరిగా జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాల్సిందేనని, ఉత్తర్వులు అమలు చేయని సంస్థలపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి హెచ్చరించారు. లోకల్‌ న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధులు డీఈఓను కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ ఖచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

పలు విద్యా సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఉత్తర్వులను అమలు చేయటం లేదని ఈ సందర్భంగా జర్నలిస్టు నాయకులు డీఈఓ దృష్టికి తీసుకొని వెళ్ళారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి ఏడాది మాదిరిగానే 2018 -19 సంవత్సరానికిగాను విడుదల చేసిన ఈ ఉత్తర్వులను పలు విద్యా సంస్థలు పట్టించుకోవడం లేదని, ఫలితంగా తమ పిల్లలకు విద్యా సంస్థల్లో చేర్చే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. 50 శాతానికి పైబడి ఫీజులు వసూలు చేస్తూ జర్నలిస్టులను అన్ని విధాలా ఇబ్బంది పెడుతూ, వేధింపులకు గురి చేస్తున్నారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా ఫీజు రాయితీ నిరాకరిస్తున్నవారి వివరాలను డీఈఓకు అందజేసారు. ఈమేరకు డీఈఓ లింగేశ్వరరెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలను పిలిపించి రెండు రోజుల్లో అమలుకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని జర్నలిస్టు నాయకులకు డీఈఓ హామీ ఇచ్చారు. జర్నలిస్టులెవ్వరూ 50 శాతానికి మించి ఫీజులు కట్టాల్సిన పనిలేదని చెప్పారు.

విద్యా సంస్థలు పట్టించుకోకుంటే తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో అసోసియేషన్‌ కన్వీనర్‌, ‘మనభూమి’ పత్రిక ఎడిటర్ పి.సత్య నారాయణ, ‘చైతన్యభూమి’ ఎడిటర్ బి. ప్రసాద్, ‘న్యూస్‌- 99’ ఎడిటర్‌ దొండా రమేష్‌, ‘కడలి’ రాజేంద్ర ప్రసాద్‌, ‘లక్ష్యం’ ధవళేశ్వరపు రవికుమార్‌, అసోసియేషన్ ప్రతినిధులు డి.బి. ప్రసాదరావు, ఆర్‌. అబ్బాస్‌, భానోజీరావు ,కృష్ణమురళి, ఎం. శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.