పలాస (శ్రీకాకుళం), ఏప్రిల్ 22 (న్యూస్‌టైమ్): పలాస-కాశీబుగ్గ నగర పురపాలక అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉన్న దానిని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే నాధుడే కరువయ్యారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి ఉన్న 8 కోట్ల 50 లక్షల నిధులు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళించడం జరిగిందని అందుకు మున్సిపల్ కమిషనర్ సహకరించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కోత పూర్ణచంద్రరావు ఆరోపించారు. అధికారులు, వార్డ్ మెంబర్స్, చైర్పర్సన్ దీని గురించి మున్సిపల్ కార్యాలయం సభలో చర్చించిన తర్వాత మాత్రమే నిధులు వెనక్కి మళ్లించాలనే నిబంధన ఉందని, చర్చా జరగకుండా నిధులు వెనకకు ఎలా వెళతాయని, అనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? మరి ఏ విషయాన్నీ పరిగణనలోనికి తీసుకొని, ఎవరి అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం జరిగిందని, ఇది ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.

దీనివలన పట్టణం అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలిగించడం ఎంతవరకు న్యాయమని, ఇలా అయితే ఇదే పార్టీ రేపు అధికారంలోకి వస్తే అన్ని మునిసిపాలిటీల గతి ఇలానే ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి నిధులు వెళ్లి పోవడం వెనుక పాలక వర్గంతో పాటు మున్సిపల్ అధికారుల హస్తం కూడా ఉందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన అభవృద్ధికి సంబంధించిన టెండర్ పనులు బిల్లులు చెల్లిచడానికి కూడా నిధులు లేకపోవడంతో భవిష్యత్తులో ఎక్కడి పనులు అక్కడే అయిపోతాయని, దీనివల్ల నగర పురపాలక అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వాపోయారు.

ఈ మధ్యనే రెండు కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగిందని ఆ పనులు కూడా నిధులు లేక ఆగిపోతావని, అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో నగర పురపాలక సంఘం ఉందని, ఆ ఉద్యోగస్తులకు గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆయన అన్నారు. పురపాలక సంఘంకి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి నిధులు మళ్లించడం ఎంతవరకు సబబు అని పూర్ణచందర్రావు ప్రశ్నించారు.