విజయవాడ, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయ అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ప్రధాన ఉత్సవాలు ముగియడంతో దేవస్థానం అధికారులు శివాలయం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించారు. రూ.9.85 కోట్ల వ్యయంతో దాత చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. విజయవాడ నగరంలోని యనమలకుదురులో నిర్మించిన శివాలయం తరహాలో మల్లేశ్వరాలయాన్ని కూడా తీర్చిదిద్దేందుకు దాత నరసింహారావు ముందుకు వచ్చారు. కానీ గత రెండేళ్లుగా పనులు సాగుతునే ఉన్నాయి. డిజైన్లకు ఆమోదముద్ర పడకపోవడం వల్లే వేగం మందగించినట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత ఈవో కోటేశ్వరమ్మ మల్లేశ్వరాలయ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. దుర్గమ్మ దర్శనం తరువాత భక్తులు అత్యధికంగా మల్లేశ్వరుని ఆశీస్సుల కోసం ఆసక్తి చూపుతారు. దసరా ఉత్సవాల్లో జగన్మాత వివిధ రూపాల్లో దర్శనమిస్తే కార్తీక మాసం అంతా మల్లేశ్వరునికి నిత్య అభిషేకాలు, దీపార్చన నిర్వహిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న మల్లేశ్వరాలయం ఆధునికీకరణకు ఎనిమిది దశాబ్దాలు పట్టింది. రాజధానిలో కీలకమైన దుర్గగుడి అభివృద్ధిలో భాగంగా మల్లేశ్వరాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతలో ఆలయ మెట్ల మార్గం, దాతల సహకారంతో ఒకవైపు ప్రాకార మండపం మాత్రమే అభివృద్ధి చేశారు. ఆలయం చుట్టూ ప్రాకార మండపాన్ని విస్తరించేందుకు చుట్టుపక్కల ఉన్న తొమ్మిది ఇళ్లను కూడా దేవస్థానం అధికారులు తీసుకున్నారు.

అప్పటి నుంచి మిగతా మూడు వైపులా ప్రాంగణ పనుల వేగం పుంజుకుంది. ప్రాకార మండప విస్తరణకు అనువుగా ఏనుగుపాదాలను ఏర్పాటు చేశారు. దానిపైన ఇనుప స్తంభాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 30 శాతం స్తంభాలను మల్లేశ్వరాలయ మెట్ల మార్గం వద్దకు తీసుకువచ్చారు. ఆటోనగర్‌లో ఆ స్తంభాలను దాత దగ్గర ఉండి తయారు చేయిస్తున్నారు. ప్రాకార మండపాన్ని విస్తరించేందుకు నవగ్రహ, కల్యాణ మండపాలను తొలగించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందుకోసమే దుర్గామల్లేశ్వర స్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆదిదంపతుల కల్యాణాన్ని రాజగోపుర ప్రాంగణానికి మార్చారు.