విశాఖపట్నం, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈనెల 11న జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. గడువు నెలరోజులున్నప్పటికీ లెక్కింపునకు అవసరమైన సిబ్బందిని ఎంపిక, నియామకపత్రాల జారీ, శిక్షణ తరగతుల నిర్వహణ వంటి పనులు చేయాల్సి ఉంది. దీనికోసం యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. గతంతో పోల్చితే ఈ సారి లెక్కింపులో అదనంగా కొన్ని పనులు చేయాల్సి ఉంది. గతంలో తక్కువ సంఖ్యలో పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి.

ఈ సారి భారీగా పోస్టల్‌ బ్యాలెట్లను ఉద్యోగులు తీసుకున్నందున సెగ్మెంట్ల వారీ వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో సెగ్మెంట్‌కు అయిదేసి చొప్పున మొత్తం 15 నియోజకవర్గాలకు 75 వీవీప్యాట్‌ యంత్రాల్లో ఉన్న స్లిప్పులను లెక్కించాల్సి ఉంది. వీవీప్యాట్‌ల ఎంపిక ర్యాండమైజేషన్‌ పద్ధతిలో లెక్కింపు రోజున తేల్చనున్నారు. అసెంబ్లీకి 75, లోక్‌సభకు 75 చొప్పున వీవీప్యాట్‌ యంత్రాలను లెక్కించాలి. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈనెల 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఒ), సహాయరిటర్నింగ్‌ అధికారులు (ఎఆర్‌ఒ)లతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్ కాటంనేని భాస్కర్‌ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లెక్కింపునకు సంబంధించి ఈసీ జారీ చేసిన నిబంధనలు, అనుసరించాల్సిన పద్ధతులను సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

తదనుగుణంగా సెగ్మెంట్ల వారీ కార్యాచరణ చేపట్టనున్నారు. లెక్కింపునకు ఉద్యోగుల నియామకాలు, వారికి శిక్షణ నిర్వహించేందుకు తేదీల ఖరారు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవగానే తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఇది పూర్తయ్యాక ఈవీఎం యంత్రాల్లో దాగిన ఓట్లను లెక్కిస్తారు. చివరిన వీవీప్యాట్‌ యంత్రాల్లో దాగిన స్లిప్పులను లెక్కించనున్నారు. ఈ మేరకు ఈసీ మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు, పోలైన ఓట్లను నగరంలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో లెక్కించనున్నారు.

లెక్కింపునకు వీలుగా ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 30 గదులను సిద్ధం చేశారు. మరో 30 గదులను స్ట్రాంగు రూమ్‌లుగా తీసుకుని ఈవీఎం యంత్రాలను భద్రపర్చారు. లెక్కింపునకు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్లాలని యంత్రాంగం భావిస్తోంది. లెక్కింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఆలోచనలో అధికారులున్నారు.