వయనాడ్ (కేరళ), ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీకి కాంగ్రెస్ తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తనను కోరితే బరిలోకి దిగుతానన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న కేరళలోని వయనాడ్ నుంచి బయల్దేరే ముందు ప్రియాంక తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ‘‘నేను పోటీకి సిద్ధమే. కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను అడిగితే వారణాసి నుంచి పోటీ చేస్తాను’’ అని చెప్పారు.

వయనాద్‌ నియోజకవర్గంలో ప్రియాంక రెండు రోజులపాటు ప్రచారం చేశారు. రాహుల్ పోటీ చేస్తున్న ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో కూడా ప్రియాంక ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ఈసారి అమేథీ నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయనాడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇటీవలే రాహుల్‌ గాంధీ వాయనాడ్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమెకు పార్టీ తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌ జనరల్‌ సెక్రటరీ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రియాంక గాంధీ తల్లి సోనియా గాంధీ నియోజకవర్గం రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌లో గుసగుసలాడుకున్నారు. ఈ విషయంపై విలేకరులు ఆమెను సూటిగా ప్రశ్నించగా రాయబరేలీనే ఎందుకు? వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదని చమత్కరించారు.

పోటీ చేయాలా వద్దా అనేది తన సోదరి ఇష్టంతోనే ముడిపడి ఉందని రాహుల్‌ గాంధీ కూడా గతంలో వ్యాఖ్యానించారు. అసలు ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తుందా లేదా అనే విషయంపై రాహుల్‌ గాంధీ సస్పెన్స్‌లోనే కొనసాగిస్తున్నారు. ప్రియాంక గాంధీకి తన నాయనమ్మ ఇందిరా గాంధీ పోలికలు దగ్గరగా ఉండటంతో త్వరగా రాజకీయ అరంగ్రేటం చేయిస్తే కాంగ్రెస్‌ పార్టీకి లాభం జరుగుతుందని పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీ చేత రాజకీయ అరంగ్రేటం చేయిస్తే ఈ ఎన్నికల్లో ప్రభావం ఎక్కువగా ఉండేదని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకుల ఒత్తిడితోనే ప్రియాంక గాంధీ యాక్టివ్‌ పోలిటిక్స్‌లోకి వచ్చినట్లుగా తెలిసింది.