ముంబయి, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి పతనాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దిగుమతిదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో రూపాయి మారకం విలువ నాలుగు నెలల కనిష్ఠానికి జారుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 24 పైసలు తగ్గి రూ.69.86 వద్ద ముగిసింది. ఒక దశలో 69.97కి పడిపోయిన మారకం రేటు ఆ తర్వాత స్వల్పంగా కోలుకుంది.

దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడంతో సూచీలు భారీగా పుంజుకున్నప్పటికీ కరెన్సీ మాత్రం పతనాన్ని మూటగట్టుకుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఫారెక్స్ డీలర్ ఒకరు తెలిపారు. డిసెంబర్ 3, 2018 తర్వాత రూపాయి ఇదే కనీస స్థాయి. మరోవైపు, గడిచిన మూడు రోజులుగా భారీగా పతనమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాలబాట పట్టాయి. ఆర్థిక, ఇంధన, ఐటీ రంగాలకు చెందిన షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకుపైగా లాభపడింది.

ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ఈ వారం ముగియనుండటంతో మదుపరులు ముందు జాగ్రత్త చర్యలకు మొగ్గుచూపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదవడం సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ప్రారంభం నుంచి చివరి వరకు లాభాల నేపథ్యంలో సెన్సెక్స్ 39 వేల మార్క్‌ను దాటింది. మార్కెట్ ముగిసే సమయానికి 489.80 పాయింట్లు లేదా 1.27 శాతం లాభపడి 39,054.68కి చేరుకోగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 150.20 పాయింట్లు(1.30 శాతం) లాభపడి 11,726.15 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.

హెచ్‌సీఎల్ టెక్ అత్యధికంగా 3.40 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. వీటితోపాటు ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, టీసీఎస్‌లు 3 శాతం వరకు మార్కెట్ వాటాను పెంచుకున్నాయి. ఇంకోవైపు, టాటా మోటర్స్, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, మారుతి, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీలు 3 శాతానికిపైగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ స్పందన, సార్వత్రిక ఎన్నికల మధ్య కూడా స్టాక్ మార్కెట్లు ఒక్క శాతానికిపైగా లాభపడటం విశేషమని స్యాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ సీఐవో సునీల్ శర్మ తెలిపారు.

అయితే, సిమెంట్ కంపెనీల స్టాకులు మాత్రం మిశ్రమంగా ట్రేడయ్యాయి. అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు 5.6 శాతం లాభపడగా ఏసీసీ మాత్రం భారీగా పతనం చెందింది. రంగాలవారీగా చూస్తే చమురు, గ్యాస్, టెలికం, ఇంధన రంగాలకు చెందిన షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతో 2.32 శాతం వరకు లాభపడగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ షేర్లూ లాభాల్లో ముగిశాయి. ఆటో షేర్లు నష్టపోయాయి. కాగా, వాల్‌స్ట్రీట్, ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్ సూచీలు రికార్డు స్థాయిలో ముగిశాయి. కానీ ఆసియా దేశాల్లో షాంఘై, టోక్యో, సియోల్ స్టాకులు మాత్రం నష్టపోయాయి. ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్‌ఐఐలు రూ.974.88 కోట్ల మేర నిధులను చొప్పించారు.

అయితే, స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి మారకం మాత్రం ఊహించని విధంగా పతనాన్ని నమోదు చేసుకుంది. ఇదిలావుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వరం గ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) ప్రకటించింది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ ఈ ఏడాది 58 లక్షల టన్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఎండీ పీకే రాథ్ తెలిపారు. వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా కస్టమర్స్ సమ్మిట్‌ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.20,844 కోట్ల టర్నోవర్ సాధించిందని వెల్లడించారు.