హైదరాబాద్, ఏప్రిల్ 24 (న్యూస్‌టైమ్): స్థానిక సంస్థల (పరిషత్) ఎన్నికలలో భాగంగా తెలంగాణలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసింది. తొలి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ బుధవారం సాయంత్రంతో పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 197 జెడ్పీటీసీ స్థానాలు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణ ఈ నెల 22న ప్రారంభంకాగా అదేరోజున జెడ్పీటీసీ స్థానాలకు 197, ఎంపీటీసీ స్థానాలకు 665 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజున జెడ్పీటీసీ స్థానాలకు 154, ఎంపీటీసీ స్థానాలకు 1,278 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఆఖరిరోజు కావడంతో పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

బుధవారం అర్ధరాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అందిన సమాచారం మేరకు తొలి విడతలో జెడ్పీటీసీలకు 2,300 నామినేషన్లు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు 18,000 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, గురువారం నామినేషన్ల పరిశీలించి, అభ్యర్థుల నామినేషన్ల జాబితాను అదే రోజు సాయంత్రం విడుదల చేస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై శుక్రవారం అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంటుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు కలెక్టర్‌కు, ఎంపీటీసీ అభ్యర్థులు ఆర్డీవో, సబ్‌ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. 27వ తేదీ వరకు అభ్యంతరాలను పరిశీలించి, నామినేషన్ల ఉపసంహరణకు 28 వరకు గడువిచ్చారు.

ఉపసంహరణల అనంతరం అదేరోజు సాయంత్రం పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు విడుదల చేసి ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. కాగా, బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 4 వరకు ప్రచారం చేసుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 92, ఎంపీటీసీ స్థానాలకు 517 నామినేషన్లు, ఖమ్మం జిల్లాలో జెడ్పీటీసీలకు 184, ఎంపీటీసీలకు 820 నామినేషన్లు దాఖలు కాగా, తిరుమలాయపాలెం జెడ్పీటీసీ స్థానానికి అత్యధికంగా 106 నామినేషన్లు వచ్చాయి. కరీంనగర్ జిల్లాలో జెడ్పీటీసీలకు 95, ఎంపీటీసీలకు 635, మహబూబాబాద్‌లో జెడ్పీటీసీలకు 96, ఎంపీటీసీలకు 537, మహబూబ్‌నగర్‌లో జెడ్పీటీసీలకు 83, ఎంపీటీసీలకు 464, నారాయణపేట జిల్లాలో జెడ్పీటీసీలకు 16, ఎంపీటీసీలకు 176, నాగర్‌కర్నూల్‌లో జెడ్పీటీసీలకు 80, ఎంపీటీసీలకు 727, వనపర్తి జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 37, ఎంపీటీసీ స్థానాలకు 259, జోగుళాంబ గద్వాలలో జెడ్పీటీసీలకు 28, ఎంపీటీసీలకు 279, ములుగు జిల్లాలో జెడ్పీటీసీలకు 15, ఎంపీటీసీలకు 112 నామినేషన్లు, నల్లగొండలో జడ్పీటీసీ స్థానాలకు 167, ఎంపీటీసీ స్థానాలకు 1,104 నామినేషన్లు, సంగారెడ్డిలో జెడ్పీటీసీలకు 97, ఎంపీటీసీలకు 741, సూర్యాపేట జిల్లాలో జెడ్పీటీసీలకు 102, ఎంపీటీసీలకు 742, వరంగల్ రూరల్ జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు 57, ఎంపీటీసీ స్థానాలకు 390 నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, పరిషత్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి కోసం అంతా ఒక్కటవుతున్నారు.

కలిసికట్టుగా గ్రామాల అభివృద్ధి చేసుకొంటామంటూ ఏకవాక్య తీర్మానంతో గ్రామాల్లో సమావేశాలు జరుపుతున్నారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఒక్కటైన గ్రామాల ప్రజలు ప్రస్తుత పరిషత్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధిలో ముందుంచేందుకు ఎమ్మెల్యేలు కూడా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో ఏకగ్రీవం చేసేందుకు చర్చలు చేపడుతున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోని వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఇసంపల్లి హేమలతను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎర్రోళ్ల అనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.

దాంతో ఆమె ఏకగ్రీవమైనట్టు ప్రకటించడమే తరువాయి. చాలాచోట్ల చదువుకున్నవారు ముందుకు వస్తే వారికి బాధ్యతలను అప్పగించేందుకు గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో గ్రామాలను వదిలివెళ్లిన విద్యావంతులు పరిషత్ ఎన్నికల్లో పాలుపంచుకొనేందుకు సొంతూళ్లకు తిరిగి వస్తున్నారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘంలో రిజిస్టర్ అయిన పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిజిస్టర్డ్ పార్టీల నుంచి పోటీచేసే అభ్యర్థులు లేనిపక్షంలో వారి గుర్తులను స్వ తంత్రులకు కేటాయిస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది.

ఎంపీటీసీ స్థానాల్లో టీజేఎస్, జనసేనతోపాటు పలు పార్టీలకు గుర్తులను మార్చా రు. ఎంపీటీసీ స్థానాల్లో సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి బకెట్, మన తెలంగాణ రాష్ట్ర సమాఖ్య పార్టీకి విజిల్, తెలంగాణ జన సమితికి గ్యాస్ సిలిండర్, జనసేన పార్టీకి బ్యాట్ గుర్తులను ఇచ్చారు. జెడ్పీటీసీ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీకి హెలిక్యాప్టర్, మన తెలంగాణ రాష్ట్ర సమాఖ్య పార్టీకి ఉంగరం, తెలంగాణ జన సమితికి అగ్గిపెట్టె, జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.