Sir CR Reddy Convocation Hall
  • కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం!

  • రేపు ఏయూ వ్యవస్థాపక దినోత్సవం

విశాఖపట్నం, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం 94 ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 26వ తేదీన నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వీసీ ఆచార్య నాగేశ్వర రావు గురువారం ఇక్కడ తెలిపారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. వర్సిటీలో 80 సంవత్సరాలు వయసు కలిగిన వర్సిటీ విశ్రాంత ఆచార్యులు, బోధనేతర సిబ్బందిని సత్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబరేటరీ(పిఆర్‌ఎల్‌) సంచాలకులు ఆచార్య అనీల్‌ భరద్వాజ్‌ హాజరవుతున్నారు.

Academic Staff College at Andhra University

ఉదయం 9 గంటలకు ఏయూ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి, మెయిన్‌ గేట్‌ వద్దనున్న ఏయూ చిహ్నాలకు వర్సిటీ వీసీ పూలమాల వేస్తారు. అనంతరం వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం లేదా ఆంధ్ర విశ్వకళా పరిషత్ లేదా ఆంధ్రా యూనివర్సిటీ గురించి కొంచమైనా తెలుసుకోవాల్సి ఉంటుంది. చదువుల తల్లిగా వీరాజిల్లి ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చి పేరు, ప్రఖ్యాతులు తీసుకువచ్చిన ఏయూ భారతదేశంలోని ప్రధానమైన విశ్వవిద్యాలయాలలో ఒకటి.

AU Architecture Department Building

ఇది తూర్పు తీరంలోని విశాఖపట్నం కేంద్రంగా సేవలందిస్తుండడం విశేషం. ఈ విశ్వవిద్యాలయం 1926లో ఏర్పడింది. మద్రాస్ యూనివర్సిటీకి అప్పుడు అనుబంధంగా ఉన్న సర్కారు, రాయలసీమలో ఉన్న కళాశాలతో ఆంధ్ర విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటుచేసింది. స్థాపించిన తరువాత 1926 నుండి 1931 వరకు మరలా రెండవ విడత 1936 నుండి 1949 వరకు విశ్వవిద్యాలయ ఉపకులపతిగా కట్టమంచి రామలింగారెడ్డి వ్యవహరించారు. ఆ మధ్య కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణ దేశ ఉపాధ్యక్షునిగా ఉన్నారు.

Historical Buildings in Andhra University

పేరుగాంచిన ఈ ఉత్తమ ఉపాధ్యాయుని నోటి మాటల్లో ఈ విశ్వవిద్యాలయం ‘కొత్తవారికి సరైన విశ్వవిద్యాలయం’. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రముఖ విద్యావేత్త న్యూమెన్ ఆదర్శ విశ్వవిద్యాలయం రూపులో ఆవిష్కృతమైంది. తర్వాత 1954లో రాయలసీమ జిల్లాలతో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఆ తర్వాత, 1967లో గుంటూరులో, ఈ విశ్వవిద్యాలయం ఒక పోస్టుగ్రాడ్యుయేటు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాలక్రమంలో ఇదే 1976లో నాగార్జున విశ్వవిద్యాలయంగా అవతరించింది. దీని పేరును ఆచార్య నాగార్జునుని పేరిట 2004లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంగా మార్పుచేశారు నాటి పెద్దలు.

Andhra University In Gate

ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉత్తర, దక్షిణ ప్రాంగణం (క్యాంపస్)లుగా ఉంది. దక్షిణ ప్రాంగణం (ఇదే మొదటి నుంచీ ఉన్న ఆవరణ)లో పాలనా విభాగంతో పాటు కళలు, మానవీయ శాస్త్రాలు, శాస్త్రీయ విజ్ఞానాల శాఖలు ఉన్నాయి. 1962లో కొత్తగా అభివృద్ధిచేసిన ఉత్తర ప్రాంగణంలో ఇంజనీరింగ్ కళాశాల ఉంది. విశ్వవిద్యాలయానికి విశాఖపట్నం వెలుపల కూడా పోస్టు గ్రాడ్యుయేటు విద్య అవసరాలను తీర్చడానికి శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాలలో పోస్టు గ్రాడ్యుయేటు కేంద్రాలను అప్పట్లో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్లలోను, తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడలోను, పశ్చిమగోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలోను, విజయనగరం జిల్లాలో విజయనగరంలోను ఆ కేంద్రాలు ఉన్నాయి. కాలక్రమంలో వాటిలో కొన్ని ప్రత్యేక విశ్వవిద్యాలయాలుగా విస్తరించాయనుకోండి.

School of Distance Education Building in Andhra University

కానీ, 2006లో రాజమండ్రిలో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని పరిధిలోనికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని కళాశాలలను తెచ్చారు. ఆ విధంగా, ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని కళాశాలలకు ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధి పరిమితమైంది. కానీ, అనుబంధ కళాశాలలకు సంబంధించి కొంత కుదించుకుపోయినా, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దాని ప్రతిభ ఏమాత్రం తగ్గలేదు. నాక్ సంస్థ ‘ఎ’ గ్రేడుతో గుర్తింపును ఇవ్వడం దీనికి తార్కాణం.

Yoga Village in Andhra_University

ఆంధ్ర విశ్వవిద్యాలయ చిహ్నాన్ని కట్టమంచి రామలింగారెడ్డి (సిఆర్‌రెడ్డి) ఉప కులపతిగా ఉన్న సమయంలో కౌతా రామమోహన శాస్త్రి రూపకల్పన చేశారు. చిహ్నంలో ఉన్న తామరపుష్పం సిరి సంపదల దేవత లక్ష్మీదేవి, చదువుల దేవత సరస్వతీదేవిల ఆసనానికి గుర్తు. స్వస్తిక్ ముద్ర ఆర్యుల ఆశీర్వచనానికి గుర్తు. బయటి వృత్తంలో ఉన్న 64 తామర రేకులు 64 కళలకు గుర్తులు. చిహ్నంలో ఉన్న తేజస్వినావధీతమస్తు అనే వాక్యానికి ‘నీ దివ్యమైన కాంతితో మా జ్ఞానాన్ని పెంపొందించు’ అని అర్ధం.

Dr. YVS_Murty Auditorium in AU Engineering College Grounds

చిహ్నంలో ఉన్న రెండు పాములు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, కాపాడుకోవడానికి గుర్తులు. ప్రాచీన నాగ వంశీకులలో ఆంధ్రుల మూలాలు ఉన్నాయంటారు. ఆ విధంగా ఈ రెండు పాములు ఆంధ్రుల ప్రాచీన మూలాలను గుర్తుకు తెస్తాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం భారతదేశంలోనే మొదటిసారిగా 1934 నుండే కామర్సులో ఆనర్సు డిగ్రీ మొదలుపెట్టింది. 1957లో దేశంలోనే మొట్టమొదటి సారిగా ఎంబీఏ కోర్సును ప్రవేశపెట్టింది. ఫార్మసీ విభాగం ఏర్పాటులో భారతదేశంలో రెండవ స్థానం (మొదట బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం). మానవ వనరులను, సాఫ్టువేరు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటానికి, ప్రైవేటు భాగస్వామ్యంతో 2008 నుండి స్కూల్ ఆఫ్ ఐటీ అనే ఒక సంస్థను నెలకొల్పింది.

Andhra University Engineering College Main Gate

ఏయూకు ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల చరిత్ర పదాల్లో చెప్పలేనిది. 26-04-1926 – 31-07-1930 మధ్య పనిచేసిన తొలి ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్ రెడ్డి) నుంచి ప్రస్తుత వీసీ జి. నాగేశ్వరరావు వరకూ ఎవరి స్థాయి వారిదేనని చెప్పవచ్చు. 01-05-1931 – 19-05-1936 మధ్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏయూ ఉపకులపతిగా సేవలందించారు. 20-05-1936 – 07-12-1949 మధ్య తిరిగి కట్టమంచి రామలింగారెడ్డే వీసీగా పనిచేశారు. 08-12-1949 – 16-06-1961 మధ్య వి.ఎస్.కృష్ణ, 17-06-1961 – 30-06-1966 మధ్య ఎ.ఎల్.నారాయణ, 30-06-1966 – 29-11-1968 మధ్య కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు, 30-11-1968 – 12-12-1974 మధ్య లంకపల్లి బుల్లయ్య, 13-12-1974 – 12-12-1980 మధ్య ఎమ్.ఆర్.అప్పారావు, 13-12-1980 – 14-11-1983 మధ్య ఆవుల సాంబశివరావు, 05-06-1984 – 23-03-1988 మధ్య కోనేరు రామకృష్ణారావు, 24-03-1988 – 23-03-1991 కె.వి.రమణ, 18-09-1991 – 15-09-1997 మధ్య మద్ది గోపాలకృష్ణారెడ్డి, 22-04-1998 – 04-03-2001 మధ్య ఆర్.రాధాకృష్ణ, 03-04-2002 – 02-04-2005 మధ్య వై.సి.సింహాద్రి, 06-05-2005 – 03-05-2008 మధ్య ఎల్.వేణుగోపాలరెడ్డి, 20-06-2008 – 19 -06-2011 మధ్య బీలా సత్యనారాయణ, 05-02-2013 నుంచి జి.ఎస్.ఎన్. రాజు, ఆయన వారసునిగా జి. నాగేశ్వరరావు వంటి మేథావులు ఉపకులపతులుగా పనిచేసిన చరిత్ర ఏయూది.

Professor G. Nageswara Rao, The Vice Chancellor of Andhra University

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్‌తో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళలు, వాణిజ్య కళాశాలను 1931లో ఏర్పాటుచేశారు. అదే ఏడాది శాస్త్ర, సాంకేతిక కళాశాలను, 1945లో న్యాయ కళాశాలను, 1951లో ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలను, తర్వాత తెలుగు విభాగాన్ని ప్రత్యేకించి ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇదే క్రమంలో 1955లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుచేశారు. 1972లో దూర విద్య పాఠశాలనూ ఏయూ మనుగడలోకి తీసుకువచ్చింది.

2010లో బీలా సత్యనారాయణ ఉపకులపతిగా ఉన్న సమయంలో ఏయూ స్త్రీల ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఇవన్నీ దేశీయంగా ఎంత ప్రాచుర్యం చెందాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏయూ ప్రదానం చేసే ‘కళాప్రపూర్ణ’ బిరుదు లేదా పురస్కారం గురించీ తెలియంది ఎవరికి? ఇది, విద్యా సాహిత్య సాంస్కృతిక విషయాలలో విశేషమైన కృషి చేసిన వారికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్. చివరిగా ఇవన్నీ ఎవరికి తెలియనివి? అనే ప్రశ్న కొంత మంది పరిశోధక విద్యార్ధులు, మేథావుల్లో రేకెత్తవచ్చు. కానీ, మన చరిత్ర గురించి మనం మరోసారి మననం చేసుకోవడం తప్పుకాదు. ఏయూ అధ్యాపకులు, విద్యార్ధులు, ఉద్యోగులకు ‘న్యూస్‌టైమ్’ 94వ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు.