హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): అటవీ రక్షణ, రాష్ట్ర స్థాయి జంతుగణన, వేసవి చర్యలపై స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో అరణ్య భవన్‌లో అటవీ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సమావేశమయ్యారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా అడవుల్లో జంతువుల కోసం నీటి వనరుల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. అటవీ రక్షణలో వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల భాగస్వామ్యం కోరుతూ 2015 సంవత్సరం నుంచి అటవీ శాఖ ప్రతీ యేటా స్వచ్చంద సంస్థలతో సమావేశం నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన సమావేశం ఐదవది.

రక్షిత అటవీ ప్రాంతాలతో పాటు, ఇతర అటవీ ప్రాంతాల్లో కూడా నీటి వనరుల యాజమాన్యంపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల వ్యాసార్థంలో, ఇతర అటవీ ప్రాంతాల్లో మూడు కిలో మీటర్ల వ్యాసార్థంలో నీటి వనరు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 145 సోలార్ బోర్ వెల్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయని, ఈ యేడాది మరో వంద కొత్తగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సహజ నీటి వసరులను రక్షిస్తూనే, అవి లేని చోట్ల కృత్రిమంగా నీటి వనరులు, నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నారు.

అమ్రాబాద్, కవ్వాల్‌తో పాటు ఏటూరు నాగారం వన్యప్రాణి అభయారణ్యాల్లో వచ్చే నెలలో (మే 11, 12) రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి జంతుగణన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధుల సహకారం తీసుకోనున్నారు. అలాగే అటవీ ప్రాంతాలు, సమీప గ్రామాల్లో ప్లాస్టిక్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఫారెస్ట్ అర్బన్ పార్కుల్లో కూడా పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహిస్తామని సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 76 అటవీ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ది చేస్తున్నామని, హైదరాబాద్ చుట్టుపక్కల 16, జిల్లాల్లో 10 పార్కులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మిగితావాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి పీ.కే.ఝా వెల్లడించారు. సమావేశంలో పీసీసీఎఫ్ పీ.కే.ఝా, పృధ్వీరాజ్, అదనపు పీసీసీఎఫ్‌లు శోభ, మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, అటవీ శాఖ అధికారులు కోట తిరుపతయ్య, శంకరన్, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నుంచి ఫరీదా తంపాల్, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.