హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): కష్టం తెలిసిన మనిషి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) అనడంలో సందేహం లేదు. సినీ రంగంలోగానీ, రాజకీయ రంగంలోగానీ ఆయన సృష్టించిన చరిత్ర మొత్తం, తాను అహరహం కష్టించి చిందించిన స్వేదబిందువులతో లిఖించినదే. ఒక సామాన్య రైతు బిడ్డగా చిన్నతనం నుంచీ కష్టపడ్డారు ఆయన. స్వయం కృషితో పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. అందలాలు ఎక్కినా క్రమశిక్షణ మర్చిపోలేదు. నిర్మాత మంచి కోసం కథానాయకుడిగా శ్రమించారు.

పరిశ్రమ బాగుకోసం మూడు షిఫ్టుల లోనూ పనిచేశారు. అగ్రనాయకుడిగా ఆయన క్రమశిక్షణ, శ్రమ తత్వం మిగిలిన నటులకు, సాంకేతిక సిబ్బందికీ ఆదర్శమైంది. సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన అభివృద్ధికి కారణమైంది. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ప్రజల కష్టాలను తెలుసుకోడానికి ఊరూరా తిరిగారు ఎన్టీఆర్. బోలెడంత ఆస్తి, సంపాదన ఉండి కూడా ఎండనక, వాననక ప్రజల మధ్య, ప్రజల కోసం అన్నట్టుగా తిరిగారు. కర్షక, కార్మిక, శ్రామిక జీవుల వెతలను అనుభవించి తెలుసుకున్నారు. వాహనాలు పోలేని మారుమూలలకు నడిచి వెళ్ళి ప్రజా జీవితాన్ని అవగాహన చేసుకున్నారు.

రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయ రంగానికి ఎన్నో రకాలుగా ఊతమిచ్చారు. ఇక, ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, మరో కురుక్షేత్ర సంగ్రామంగా ప్రసిద్ధి కెక్కిన ‘పల్నాటి యుద్ధం’ 1173 -1182 మధ్య కాలంలో జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఈ పల్నాటి చరిత్ర ఆధారంగా 1966లో విడుదలైన ‘పల్నాటి యుద్ధం’లో బ్రహ్మనాయుడి పాత్రను పోషించారు ఎన్టీఆర్. నాగమ్మ పాత్రను భానుమతి పోషించారు. మహావీరుడు, యుక్తిపరుడే కాదు, సర్వమానవ సౌభ్రాతృత్వం, సమానత్వాలను కోరుకున్న తొలి సంఘ సంస్కర్త బ్రహ్మనాయుడు.

రాజ్యపాలనలో కుల, మత, వర్గ ప్రభావాలు లేకుండా చూసిన బ్రహ్మనాయుడు అసలు సిసలైన లౌకికవాది. అన్ని వర్గాలతో కలసి చాపకూడు, సహపంక్తి భోజనాలు అనే అభ్యుదయ విధానాలకు శ్రీకారం చుట్టిన సామాజిక విప్లవకారుడాయన. ఇలాంటి పాత్రలకు ఎన్టీఆర్ సరిసాటి రారెవ్వరు. ఒక కోణంలోంచి పౌరుషాన్ని, మరో కోణం నుంచి సౌభ్రాతృత్వాన్ని పలికించగల ముఖవర్చస్సు ఎన్టీఆర్ సొంతం.

బ్రహ్మనాయుడిలో ఉన్న అభ్యుదయ భావాలన్నీ ఎన్టీఆర్‌లోనూ ఉన్నాయనడానికి వారిద్దరి పాలనా సారూప్యాలే సాక్ష్యం. తెలంగాణా ప్రాంతంలో పటేల్, పట్వారీ, మునసబు, కరణం వ్యవస్థలను రద్దు చేసిన ఎన్టీఆర్, పూజారులుగా బ్రాహ్మణేతరులకు అవకాశమిచ్చిన ఎన్టీఆర్, తండ్రి ఆస్తిలోనూ, భర్త ఆస్తిలోనూ మహిళలకు హక్కును ఇచ్చిన ఎన్టీఆర్ పల్నాటి బ్రహ్మనాయుడుకు ఏమాత్రం తీసిపోరు.