హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో అంతా అగమ్యగోచరంగా తయారైంది. ఫలితాలు వెలువడిన తర్వాత ఎప్పుడూ లేనంతగా విద్యార్ధుల్లో నిరసన వ్యక్తం కావడాన్ని అధికారులు బహుశా ముందుగా ఊహించి ఉండరు. ఆశించిన ఫలితాలు ఇంత దారుణంగా ఉంటాయని ఇటు విద్యార్ధులు కూడా భావించి ఉండరు. ఏది ఏమైనా పదుల సంఖ్యలో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘‘పాలన అంటే గాలికి నడిపించడం కాదు, అధికారం అంటే కేవలం ప్రత్యర్థి పార్టీల నాయకులను కొనడం కాదు, అధికారం పూర్తిగా ఏకపక్షంగా కేంద్రీకృతం అయిపోతే, అది నియంతృత్వంగా మారితే, నిర్లక్ష్యానికే ఓ తార్కాణంగా మారితే, ఇదుగో ఇలాగే ఇంటర్ పిల్లల ఆత్మహత్యల్లా సమాజం రోదిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది’’ అన్న ధోరణి విద్యార్ధుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.

ఒకవిధంగా చూస్తే ఇది నిజమనే అనిపిస్తుంది. తప్పు మీద తప్పు, దిద్దలేని తప్పులు, పిల్లల్ని అవస్థల పాల్జేస్తున్న తప్పులు, ఇంటర్ బోర్డులో ఏం జరుగుతుందో ఇన్నాళ్లూ పట్టించుకున్నవాడు లేడు. అసలు విద్యాశాఖకు ఓ మంత్రి ఉన్నాడా? ఎవరికీ తెలియని దుస్థితి ఇది. ఏకంగా పంతొమ్మిది మంది పిల్లలు రాలిపోయాక, ఇప్పుడు తాపీగా తెరమీదకు వచ్చి, ఓ కమిటీ వేశాను, ఇకపొండి అని చేతులు దులుపుకొన్నాడు విద్యా మంత్రి. ఏం చేయాలి ఈ కమిటీ? ఓ నివేదిక ఇస్తుంది సరే, అప్పుడేం చేస్తారు? ఏమీ జరగలేదు, అంతా సాఫీగా ఉంది అంటుందా ప్రభుత్వం? పోనీ, ఫలానా తప్పులు జరిగాయి, డేటా ప్రాసెసింగు, రిజల్ట్స్ ప్రాసెసింగు కంట్రాక్టు ఓ నాసిరకం, అర్హతల్లేని ఐటీ కంపెనీకి ఇచ్చారు అని తేలుస్తుందా? అదసలే సర్కారు ముఖ్యుల్లో ఎవరికో క్లోజట.

మరిప్పుడేం చేయాలి? పోనీ, తప్పే అని నిర్మొహమాటంగా తేల్చిందీ అనుకుందాం, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఉచితంగా, ఫీజు లేకుండా చేస్తాం, దరఖాస్తు చేసుకొండి అని ప్రకటిస్తుందా? సకాలంలో చేయగలదా అంతమంది పిల్లల సమాధానపత్రాలను? అసలు వాల్యూయేషన్‌కే దిక్కులేక, ఎవరు దొరికితే వాళ్లను తీసుకొచ్చి దిద్దించారు అన్న అపవాదు మూటకట్టుకున్న తర్వాత ఇక రీవాల్యూయేషన్ ఎలా? మరి పరిష్కారం ఇంకెలా? ఈలోపు సప్లిమెంటరీ రాసే గడువు దాటుతుంది. వివిధ ఎంట్రన్సులు, ప్రవేశాలు దగ్గరికొస్తాయి. పోనీ, గ్రేస్ మార్కులేస్తారా? మళ్లీ పరీక్షలు పెడతారా? అదీ అసాధ్యం.

మరి ఈ పిల్లలకు భరోసా ఏది? ‘‘అధికారుల అంతర్గత కలహాలు, అపోహలతో ఫలితాలపై గందరగోళం సృష్టించారు’’ అంటున్నారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి. వాళ్లు ఎవరు? ఎవరిపై వేటు వేశారు? ఏమీ లేదు. మరి మొత్తం వైఫల్యానికి ఇంటర్ బోర్డును, సెక్రటరీని ఏం చేశారు? ఏమీ లేదు. వేటు వేస్తే వైఫల్యాన్ని అంగీకరించినట్టు అనుకుని వదిలేశారు. ఈలోపు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగిన ఏబీవీపీ, ఎన్ఎస్యూఐ పిల్లల్ని, నాయకుల్ని, తల్లిదండ్రుల్ని ఈడ్చిపారేశారు. ఠాణాలకు తరలించారు. సరే, అసలు ఫలితాల వెల్లడికే జాప్యం జరుగుతుంటే కారణాలేమిటో కనుక్కునే టైం లేదా ఈ సర్కారుకు? ఎంతసేపూ జెడ్పీటీల టికెట్లు ఎవరిద్దాం? జెడ్పీ ఛైర్మన్లు ఎవరు కావాలి? మిగతా కాంగ్రెసోళ్లను ఎలా కొందాం? ఇదేనా ఆలోచన? మిగతా పత్రికలు ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ సర్కారులాగే అట్టర్ ఫ్లాప్.

అసలు అర్హతలు లేకపోయినా ఆ గ్లోబరినా కంపెనీకి కంట్రాక్టు ఎలా ఇచ్చారు అని కొన్ని మీడియా సంస్థలు మాత్రమే ప్రశ్నించాయి. సదరు కంపెనీ జేఎన్టీయూ కాకినాడకు పనిచేసింది. దాని పనితీరుపై, ఆ వర్శిటీలో జరిగిన నిర్వాకాలపై, దాని చెత్త ట్రాక్ రికార్డుపై గవర్నర్ నరసింహన్‌కూ అవగాహన ఉంది, ఇప్పుడు తెలంగాణ ఇంటర్ క్రైసిస్ మీద కూడా ఆరా తీసే ఉంటారు. కానీ ఇప్పుడు కేసీయార్‌తో తనకున్న సంబంధాల నేపథ్యంలో తను ఏమీ మాట్లాడదు. ఆ దిక్కుమాలిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థేమో మొదట టీఎస్పీఎస్సీని ముంచేసింది. ఇప్పుడు ఇంటర్ బోర్డు కూడా దాన్ని వదిలేసి, ప్రైవేటు బాట పట్టింది. ఆ సంస్థ మనుగడ అవసరమా ఇంకా? అదీ ఆలోచించినవాళ్లు లేరు.

గతంలోనే సుప్రీం కోర్టు చెప్పినట్టుంది, పిల్లలు అడిగితే, వెరిఫికేషన్ కోసం, వాల్యూయేట్ చేసిన సమాధానపత్రాలు ఇవ్వాలని. ఈ సర్కారు అది చేయగలదా? ఒక్క ముక్కలో చెప్పాలంటే… వాల్యూయేషన్ ఎంత ఘోరంగా జరిగిందో బయటపడుతుంది. 12 లక్షల మంది పిల్లలతో ఈ అసమర్థ అధికారులు ఎలా ఆడుకున్నారో తేలుతుంది. నిన్న జీరో మార్కులొచ్చిన ఓ సబ్జెక్టులో ఒకమ్మాయికి పరిశీలన తరువాత 99 వచ్చాయి. మరి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల మూల్యాంకనమూ ఇంత ఛండాలంగా ఉండి ఉంటే. ఆ ప్రాణాలను ఎవరు తిరిగి తీసుకొస్తారు? ఆ తల్లుల కడుపుకోత మాటేమిటి? పోతేపోనీలెండి. ఆఫ్టరాల్ కొందరి ప్రాణాలు అంటారా? అంతేలెండి, అచ్చంగా అలాగే ఉంది పరిస్థితి!