హైదరాబాద్, ఏప్రిల్ 25 (న్యూస్‌టైమ్): హిమాయత్‌నగర్‌లోని సూత్రధార్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వాహకుడు వినయ్‌వర్మను నారాయణగూడ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నటన నేర్చుకోవాలంటే అర్థనగ్నంగా నిలబడాలని వినయ్‌ యువతులను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి.

పై దుస్తులు విప్పితేనే నటనలో శిక్షణ ఇస్తానంటూ తనను వినయ్‌వర్మ వేధించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అక్కడి నుంచి జైలుకు తరలించారు. యాక్టింగ్‌ స్కూల్‌ పేరుతో వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని ఓ అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి షీటీమ్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.