న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ బిహార్ రాజధాని పట్నాకు బయల్దేరారు. అయితే, మార్గం మధ్యలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది.

దీంతో ఢిల్లీకి తిరుగు పయనమవ్వాల్సి వచ్చింది. సమస్యను అధికారులకు వివరించిన పైలట్లు అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. విమానంలో పైలట్లతో సహా మొత్తం 12 మంది ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొనాల్సి ఉంది.

అయితే, తాజా ఘటనతో సభలు ఆలస్యంగా ప్రారంభమవుతాయని, అసౌకర్యానికి క్షమించాలని రాహుల్‌ ట్విటర్‌ ద్వారా ప్రజలను, పార్టీ శ్రేణులనూ కోరారు. మరోవైపు, విమానంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తడంపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి ఘటనే ఎదురైంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు డిమాండ్‌ చేశారు. దీంట్లో ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. కానీ అలాంటిదేమీ లేదని, ప్రమాదం చాలా చిన్నదేనని డీజీసీఏ స్పష్టం చేసింది.