• అధికారుల వర్క్‌షాప్‌లో సుదీర్ఘ సమాలోచన

  • నివారణోపాయాలపై తెలంగాణ సీఎస్ సూచనలు

హైదరాబాద్, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): అడవుల సంరక్షణ, వణ్యమృగాల గణన వంటి అంశాలలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించి చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ఆశించిన ఫలితం వస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడ రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్‌షాప్‌లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆయన అటవీ సంరక్షణపై ప్రధానంగా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఎదురౌతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై నేరుగా అధికారులతో చర్చించిన సీఎస్ కొన్ని నివారణోపాయాలపై పలు సూచనలు చేశారు.

ఇక్కడి దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల రెండురోజుల వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సమస్యలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అటవీశాఖ గత ఏడాది పనితీరుపై సమీక్ష నిర్వహించడంతో పాటు రానున్న ఏడాది కాలంలో లక్ష్యాలు, ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. అటవీ ప్రాంతాల రక్షణ, అటవీ సంబంధిత కేసుల సత్వర పరిష్కారం, స్మగ్లింగ్, ఆక్రమణల నిరోధం, వేసవిలో వన్యప్రాణులకు నీటి సౌకర్యం, అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణ, అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, కాళేశ్వరం పరిధిలో పరిహార అటవీ పెంపకం, ఐదవ విడత హరితహారం, నర్సరీలు, జిల్లాల వారీగా లక్ష్యాలపై వర్క్‌షాప్‌లో చర్చించారు. ఉదయం సెషన్‌లో సీఎస్, మధ్యాహ్నం సెషన్‌లో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా వర్క్‌షాప్‌లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అటవీ పరిరక్షణకు డ్రోన్లు, సాంకేతిక సహకారం వాడాలని సీఎస్ సూచించారు. హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం చీఫ్ కన్జర్వేటర్లు, కొందరు జిల్లా అటవీ అధికారులతో చీఫ్ సెక్రటరీ నేరుగా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఎదురౌతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ సిబ్బందితో ఎక్కువ పనిచేస్తున్నామని, అటవీ భూముల రక్షణకు ఇతర శాఖల సమన్వయం కావాలని అధికారులు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, అటవీశాఖల సమన్వయంతో ఫారెస్ట్ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటును పరిశీలిస్తామని సీఎస్ తెలిపారు. అన్ని జిల్లాల్లో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారులను నియమిస్తామన్నారు.

అలాగే రైతుల భాగస్వామ్యం, వ్యవసాయ శాఖ మద్దతుతో ఆగ్రో ఫారెస్ట్రీ అభివృద్ధి చేస్తామని, అగ్రికల్చర్ ఎక్సటెన్షన్ అధికారులను కూడా ఇందులో భాగం చేస్తామన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా అటవీ భూముల సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందన్నారు. అడవులపై సమీప గ్రామాల ప్రజల వల్ల పడే భారం తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఆక్రమిత అటవీ భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. తెలంగాణలో కనిపించే పాముల రకాలపై రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేసారు. మధ్యాహ్నం సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పాల్గొని, రానున్న ఐదవ విడత హరితహారం సన్నాహకాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిపై సమీక్షించారు. వర్క్‌షాప్‌లో పీసీసీఎఫ్ పీకే ఝా, అటవీశాఖ ఉన్నతాధికారులు, అన్ని జిల్లాలకు చెందిన డీఎఫ్‌వోలు, ఎఫ్‌డీవోలు పాల్గొన్నారు.