• గవర్నర్‌ నరసింహన్‌తో అఖిలపక్ష నాయకులు సమావేశం

హైదరాబాద్, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో తెలంగాణ అఖిలపక్ష నాయకులు భేటీ అయ్యారు. గవర్నర్‌తో భేటీలో ఇంటర్‌ ఫలితాలలో ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతోన్న రాజకీయ ఫిరాయింపులపై అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు. ఇంటర్‌మీడియట్లో జరిగిన అక్రమాలపై న్యాయవిచారణ జరిపి ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే చూడాలని అఖిలపక్ష నాయకులు కోరారు. ఇంటర్‌మీడియట్‌ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్‌ నరసింహన్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

రెండు విషయాలపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. కనీస పరిపాలనా సమర్థత కేసీఆర్‌కు లేదని విమర్శించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇంటర్‌ ఫలితాల విషయంలో విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వ్యాక్యానించారు. అందరికీ న్యాయం జరిగేలా మరోసారి ఫలితాలు పున:సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని, కారకులను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వెంటనే భర్తరఫ్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. గ్లోబెరినా ఐటీ సంస్థ, ఇంటర్‌ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని కేబినేట్‌ నుంచి భర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్‌పీ విలీనం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్‌తో సంబంధం లేకుండా సీఎల్పీ విలీనం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ను నిన్న గాక మొన్న పుట్టిన టీఆర్‌ఎస్‌లో విలీనమా? సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కోట్లు పెట్టి, పదవులు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తెలంగాణ జనసమతి అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌. రమణ, టీడీపీ సీనియర్‌ నాయకులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.