కాకినాడ, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): బంగాళాఖాతానికి ఆగ్నేయంగా, హిందూ మహాసముద్రంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తూ వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక దృష్ట్యా జిల్లా తీరం నుండి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారులు, పడవలు శనివారం మధ్యాహ్నం లోపు తిరిగి తీరానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించి శ్రీలంక సమీపాన సముద్రంలో ఏర్పాడిన డబ్ల్యూడి-91బి వాతావరణ అలజడి హెచ్చరిక దృష్ట్యా జిల్లా యంత్రాంగం చేపట్టిన అప్రమత్త చర్యలను వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మహాసముద్రంలో, బంగాళాఖాతానికి సమీపంలో శ్రీలంకకు ఆగ్నేయంగా 1700 కిమీ దూరంలో అల్పపీడనం ఏర్పాడిందని భారత వాతావరణ శాఖ బులిటెన్ జారీ చేసిందని, ఈ అల్పపీడనం తమిళనాడు తీరం వైపు పయనిస్తూ శనివారం మధ్యాహ్నానికి మరింత బలపడ నుందని ఈ బులిటిన్‌లో తెలియజేశారన్నారు. జిల్లా తీరంలో ప్రస్తుతం సముద్రవేట నిషేధ కాలం అమలులో ఉందని, అయినప్పటికీ ఎవరైనా మత్స్యకారులు నిషేధ ఉత్తర్వులు అతిక్రమించి సముద్రంలో వేటకు వెళ్లి ఉంటే శనివారం మధ్యాహ్నం లోపు తిరిగి తీరానికి చేరుకోవాలని ఆయన కోరారు.

ఈ మేరకు మత్స్య, రెవెన్యూ, పోర్టు శాఖలు, ఇండియన్ కోస్ట్ గార్డ్, పోలీస్ యంత్రాగాల ద్వారా మత్స్యకారులను అప్రమతం చేయాలని ఆదేశించామన్నారు. అల్పపీడన సూచన నేపధ్యంలో జిల్లాలో సాధారణ అలెర్ట్ ప్రకటించామని, పరిస్థితిని నిరంతరం గమనిస్తూ అవసరమైతే హై అలెర్ట్ జారీ చేస్తామన్నారు. తుఫాను రక్షణ యంత్రాంగం ఈ మేరకు అప్రమత్తం కావాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలో రబీ కోతలు 75 శాతం పూర్తయ్యాయని, మరో 7 నుండి 8 శాతం పంటలు కోతలు నిర్వహించి బస్తాలలో తరలించే దశలో ఉన్నాయన్నారు. రైతుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు పీపీసీ కేంద్రాలు చురుకుగా పనిచేస్తున్నాయని, ప్రతికూల వాతావరణ సూచనల దృష్ట్యా కొనుగోళ్లను మరింత ఫాస్ట్ ట్రాక్ చేసేందుకు ఆదేశించడం జరిగిందన్నారు.

అలాగే వ్యవసాయ, ఉద్యాన వన శాఖల ద్వారా పంటల రక్షణకు అవసరమైన చర్యలన్నిటినీ సమగ్రంగా చేపడుతున్నారని తెలియజేశారు. తుఫాను వల్ల ఈవియంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై ఎటువంటి దుష్ప్రభావం పడకుండా పటిష్టమైన జాగ్రత్తలు ఇప్పటికే చేపట్డడం జరిగిందన్నారు.

ప్రస్తుత అల్పపీడం తుఫానుగా మారే అవకాశం తక్కవగా ఉన్నప్పటికీ, తుఫాను సంసిద్ధతా చర్యలలో ఎటువంటి అలసత్వం వద్దని ఆయన జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో యం.వి.గోవిందరాజులు, సమాచార శాఖ డీడీ యం.ఫ్రాన్సిస్, కలెక్టరేట్ విపత్తుల నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ చైనులు తదితరులు పాల్గొన్నారు.