పట్న, ఏప్రిల్ 26 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ భద్రత విషయం సమస్యే కాదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని నరేంద్రమోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, దేశ భద్రత అనేవి సమస్యలా? కాదా? అన్న విషయాలను ప్రజలే చెప్పాలని విజ్ఞప్తి చేసారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని దర్భంగాలో భాజపా నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాల్సి ఉంది. ఉగ్రవాదం వల్ల శ్రీలంకలో 300కు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ భద్రత అనేది మహా కల్తీ కూటమి గ్యాంగ్‌కి ఓ సమస్యే కాదట. నేను ఉగ్రవాదం గురించి ఎందుకు మాట్లాడుతున్నానని వారు అడుగుతున్నారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.

‘‘భారత్‌ మాతా కీ జై, వందే మాతరం అని నినాదాలు చేస్తుంటే దీనిని ఒక సమస్యగా కొందరు భావిస్తున్నారు. అటువంటి వారు ఈ ఎన్నికల్లో డిపాజిట్లను కూడా కోల్పోతారు. ‘కనీసం మీరు అర్థం చేసుకుంటున్నంత కూడా వారు అర్థం చేసుకోవట్లేదు. కానీ, మనది న్యూ ఇండియా. ఉగ్రవాదంపై పూర్తి స్థాయిలో పోరాటం జరుపుతోంది. మీ కాపలాదారుడు అప్రమత్తతో ఉన్నాడు. కేవలం మూడు దశల ఎన్నికలు జరగగానే ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. భారత వైమానిక దళం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి ఆధారాలు అడగడం మానేసి, ఇప్పుడు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం మొదలు పెట్టాయి’’ అని మోదీ అన్నారు.