హైదరాబాద్, ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): నాలుగు రోజుల క్రితం స్థానిక కృష్ణానగర్లోని తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడిన తలకు జరిగిన తీవ్ర గాయంతో సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సినీ, టీవీ నటుడు పి. సుభాష్ చంద్ర (పీఎస్సీ) బోస్‌ ఆదివారం కన్నుమూశారు. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి గాంధీ ఆసుపత్రిలో వైద్యుల పర్యక్షణలో ఉండగానే తుదిశ్వాస విడిచారు. ‘సాహసపుత్రుడు’ సినిమాతో బోస్‌ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.

హిందీలో ‘ప్రతిబంధ్‌’ సినిమాలో నటించారు. చిరంజీవి ‘కొదమ సింహం’ సినిమాలో కనిపించారు. సురేశ్‌బాబు ప్రొడక్షన్స్‌లో వచ్చిన ‘ప్రేమఖైదీ’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించారు. దర్శకుడు కృష్ణవంశీ తొలి సినిమా ‘గులాబి’ (1995) నుంచి ‘డేంజర్‌’ (2005) వరకు దాదాపు ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ బోస్‌ కనిపించారు. పూరీ జగన్నాథ్‌, కృష్ణవంశీ, ఉత్తేజ్‌ తనకు మంచి స్నేహితులని బోస్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇడియట్, నిన్నే పెళ్లాడతా, అల్లరి రాముడు, శివమణి వంటి సినిమాల సహా పలు టీవీ సీరియళ్లలోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు బోస్.

కాగా గత కొంతకాలంగా ఆయనకు సినిమా వేశాలు తగ్గాయి. గతంలో ఎక్కువగా హీరోలకు ఫ్రెండ్ వేషాలు వేసేవారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మరోవైపు, బోస్ మరణంతో సినీ, టీవీ రంగాల్లో విషాదం అలుముకుంది. ఆయనతో అనుబంధం ఉన్న నటీనటులు విచారం వ్యక్తం చేశారు. సుభాష్ చంద్రబోస్ దాదాపు మూడు దశాబ్దాలుగా నట ప్రస్థానం కొనసాగిస్తున్నారు. సుమన్ హీరోగా వచ్చిన సాహసపుత్రుడు చిత్రంతో సినీ రంగానికి పరిచయం అయ్యారు. బోస్‌ను పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు ఎక్కువగా ప్రోత్సహించారు.