భోపాల్‌ (మధ్యప్రదేశ్), ఏప్రిల్ 28 (న్యూస్‌టైమ్): మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లోక్‌సభ నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం యావత్ దేశాన్ని ఆకట్టుకుంటోంది. ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్ధినిగా పోటీచేస్తున్న సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్‌ లక్ష్యం కాంగ్రెస్ సీనియర్ నేత, అక్కడి నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలోపడ్డారు. తన శాపం వల్లే ముంబయి పేలుళ్ల సమయంలో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే మరణించారంటూ భాజపా అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యల్ని దిగ్విజయ్ ఈ విధంగా వ్యాఖ్యానించి ఎద్దేవా చేశారు. భోపాల్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి దిగ్విజయ్ రోడ్‌షో నిర్వహించారు.

పాకిస్థాన్‌ స్థావరంగా ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న జైష్‌ ఏ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను సాధ్వి శపించి ఉంటే మెరుపుదాడుల అవసరమే ఉండేది కాదంటూ ఆయన వ్యాంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎక్కడ దాక్కున్నా వెంటాడి మరీ ఉగ్రవాదులను వేటాడుతామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, మరి పుల్వామా, పఠాన్‌కోట్, ఉరి దాడులు జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నారని దిగ్విజయ్ ప్రశ్నించారు. ఆ దాడులను ఎందుకు నిరోధించలేకపోయారని నిలదీశారు. దేశంలోని అన్ని మతాలకు చెందిన ప్రజలు తనకు కావాల్సినవారేనని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతీయ జనతా పార్టీ మాత్రం హిందువులకు ప్రమాదం ఉందని, కావున అందరూ ఏకం కావాలని పిలుపునిస్తున్నారని ఆరోపించారు. ఈ దేశాన్ని 500 ఏళ్లు పాలించిన ముస్లిం రాజులు ఏ మతానికీ హాని తలపెట్టలేదని చెప్పుకొచ్చారు. మతం పేరిట రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘హర్ హర్ మహాదేవ్’ అనే హిందూ జపాన్ని భాజపా ‘హర్‌ హర్‌ మోదీ’ అంటూ అపహాస్యం చేస్తోందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఒక విధంగా ఇది హిందువుల మనోభావాలను కించపరచడమేనన్నారు. భోపాల్‌ అభ్యర్థిగా కాంగ్రెస్ తన పేరు ప్రకటించించగానే భాజపా భయభ్రాంతులకు గురయ్యిందని, అందుకే ఆ పార్టీ సీనియర్ నేతలు ఉమాభారతి, గౌర్ వంటి వారు సైతం పోటీకి నిరాకరించారన్నారు. దేశంలోని అన్ని వర్గాలు కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చెందాలనుకునే పార్టీ కాంగ్రెస్ అని, కానీ, బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎదురుచూసేదన్నారు.

మే 23న వెల్లడి కానున్న ఫలితాలు నరేంద్రమోదీకి ఖంగుతినిపించనున్నాయని, ఒకసారి ప్రజలు తిరిగబడితే పరిణామం ఎలా ఉంటుందో బీజేపీకి అప్పుడు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. భోపాల్ నియోజకవర్గానికి వచ్చే నెల 12న ఎన్నిక జరగనుంది. అప్పటి వరకూ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఈ మాటల యుద్ధం తప్పేలా లేదు.