హైదరాబాద్, ఏప్రిల్ 30 (న్యూస్‌టైమ్): తెలంగాణ భాజపా అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నేతలు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయతోపాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించేందుకు అనుమతులు లేవని, ఇక్కడ ఆందోళనలు చేయవద్దని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో తప్పులకు నిరసనగా హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ సోమవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.