నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా చలనచిత్ర రంగ అభివృద్ధికి, వైభవానికి, కీర్తికీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) చేసిన సేవ ఎనలేనిది. అందుకు ప్రభుత్వాల గుర్తింపు కన్నా మిన్నగా, తరగని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమాల పరంగా ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినా, ఎన్టీఆర్ సాధించిన వ్యక్తిగత విజయానికి, సినీరంగ సేవలకు ప్రభుత్వం నుండి తగిన అవార్డులు రాలేదనే చెప్పాలి. 1968లో మాత్రం భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘పద్మశ్రీ’ పౌర పురస్కారమివ్వడం కొంతలో కొంత ఊరడింపు. ఇదే సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు, సునీల్ దత్, వైజయంతిమాల, దుర్గాఖోటే వంటి సినీప్రముఖులు కూడా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. నాటి రాష్ట్రపతి జాకీర్ హుసేన్ చేతులమీదుగా ఎన్టీఆర్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంటున్నప్పటి చిత్రం ఇది.

ఇక, ఎన్టీఆర్ పాలనలో రైతు సంక్షేమం గురించి గట్టి కృషి జరిగింది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత గురించి రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసేది చేస్తూనే కేంద్ర సహకారం గురించి కూడా పోరాడారు ఎన్టీఆర్. మార్చి 22, 1983న రాష్ట్ర శాసనసభలో రైతు గిట్టుబాటు ధరల గురించి ఎన్టీఆర్ చేసిన ప్రసంగమే అందుకు నిదర్శనం. ‘‘వ్యవసాయ ధరల విధానం అసంతృప్తికరంగా ఉంది.

రైతుకు గిట్టుబాటు ధరను పరిగణలోకి తీసుకోవడం లేదు. సబ్సిడీలపై హెచ్చు మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేయాల్సివస్తోంది. ఉత్పత్తి వ్యయం, ఉత్పాదక స్థాయి, మార్కెట్ సరళి గురించి రైతు ప్రతినిధులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయించే పద్దతి ఈనాడు అవసరం. రాష్ట్ర ప్రభుత్వాల ఆజమాయిషీ తప్పి మార్కెట్లో ధరలు పడిపోతే కేంద్రం రైతులకు సబ్సిడీలు అందించాలి’’ రైతుకు గిట్టుబాటు ధరల గురించి ఎన్టీఆర్ ఎంతగా అలోచించి, భావి ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేసిందీ ఆయన ప్రసంగం చెబుతోంది.