న్యూఢిల్లీ, మే 5 (న్యూస్‌టైమ్): జాతీయస్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-2019 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 154 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష కొనసాగింది. దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్టు అంచనా. ఈ ఏడాది మొత్తం 15.9 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ పరీక్ష ద్వారా 66,771 ఎంబీబీఎస్ సీట్లు, 27,148 బీడీఎస్ సీట్లు భర్తీ చేయనున్నారు. నీట్‌లో వచ్చే మార్కులను ఆయుష్ వంటి ఇతర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు పరిగణనలోకి తీసుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మొదటిసారిగా నీట్ పరీక్షను నిర్వహించింది. అభ్యర్థులందరికీ ముందుగానే వివిధ మార్గాల ద్వారా స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు.

దాదాపు అందరూ మధ్యాహ్నం 12 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 12:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. కొందరు అభ్యర్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో ఒక్కటే తెచ్చుకోవడం, ఫొటో లేకుండా రావడంతో చివరి నిమిషంలో కంగారుపడాల్సి వచ్చింది. ఇలాంటి విద్యార్థుల కోసం చెన్నైలోని ఎగ్మోర్‌లో ఉన్న పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటుచేశారు. వస్త్రధారణ, అలంకరణ వస్తువుల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో యువతులు ఇబ్బందులు పడ్డారు.

చాలాచోట్ల ముక్కుపుడకలు, చెవికమ్మలను సైతం తొలిగించారు. హైహీల్స్, షూస్‌పై నిషేధం, లేతరంగు దుస్తులే వేసుకోవడం వంటి నిబంధనలను కఠినంగా అమలుచేశారు. గత ఏడాది నీట్ పరీక్షలో భౌతికశాస్త్రంలో చాలా కఠినమైన ప్రశ్నలు ఇచ్చారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి పేపర్ కాస్త సులభంగానే వచ్చిందని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా జీవశాస్త్రం నుంచి సులభమైన ప్రశ్నలు వచ్చాయని, భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి ఊహించినదానికన్నా కాస్త కఠినమైన ప్రశ్నలు వచ్చాయని చెప్పారు.

భౌతికశాస్త్రంలో మొత్తం 45 ప్రశ్నలు రాగా 9 కఠినంగా, 25 మధ్యస్థంగా, 7 సులభంగా ఉన్నాయని చెప్పారు. రసాయనశాస్త్రంలో 45 ప్రశ్నలకుగానూ 7 కఠినంగా, 20 మధ్యస్థంగా, 18 సులభంగా వచ్చాయని వివరించారు. ఇక జీవశాస్త్రానికి 90 మార్కులు కేటాయించగా ఇందులో 45 జంతుశాస్త్రానికి, మరో 45 వృక్షశాస్త్రానికి కేటాయించారు. మొత్తంగా 35 ప్రశ్నలు సులభంగా, 45 ప్రశ్నలు మధ్యస్థంగా రాగా కేవలం 10 ప్రశ్నలు మాత్రమే కఠినంగా వచ్చాయని విశ్లేషించారు. ఫొని తుఫాన్ నేపథ్యంలో ఒడిశాలో నీట్ పరీక్షను వాయిదా వేశారు. తాజా పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.