భువనేశ్వర్‌, మే 6 (న్యూస్‌టైమ్): ‘ఫొని’ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుపాను అనంతర పరిస్థితిని సమీక్షించేందుకు ఒడిశా రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేష్ లాల్, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ప్రధాని ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. పిప్లి, పూరి, కోణార్క్, నిమాపాడ, భువనేశ్వర్‌లో వైమానిక దళానికి చెందిన విమానం ద్వారా ప్రధాని సర్వే చేపట్టారు. ఫొని తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశా పునర్నిర్మాణానికి కేంద్రం తనవంతు సాయాన్ని అందిస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల నష్టపరిహారాన్ని మోదీ ప్రకటించారు. అలాగే గాయపడ్డ వారికి రూ.50వేలు అందజేస్తామన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రానికి రూ.381 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించామని, సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పెను విపత్తు సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలకు ఒడిశా ప్రజలు స్పందించిన తీరును ఆయన అభినందించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి పనిచేశాయన్నారు. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నవీన్‌ పట్నాయక్‌ చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటామని తెలిపారు.

త్వరలోనే కేంద్ర ప్రభుత్వ తరఫున నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమగ్ర కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మరోవైపు, ఈ తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 34కి చేరింది. ‘ఫొని’ తుపాను ధాటికి ఒడిశాలోని పూరీ, ఖుర్దా, నయాగఢ్‌, కేంద్రపడ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే. కటక్‌, గంజాం, జగత్సింగ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌ జిల్లాల్లో పాక్షిక ప్రభావం కనిపించింది. ఈ తుపాను ధాటికి పూరీ జిల్లాలో విద్యుత్తు, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించించిపోయాయి. అలాగే తీర ప్రాంత జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకొన్నాయి.

ఒడిశాలోని పలు జిల్లాల్లో ఆరు లక్షల హెక్టార్లల్లో వరి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ప్రధానమంత్రి ఒడిషా ప్రజలకు తన పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి ఉపశమనాన్ని కల్పించడమే కాక, రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నిర్ధారించేందుకు కూడా పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు. జీవన నష్టాన్ని తగ్గించడానికి ఉపగ్రహ చిత్రణ, అధునాతన వాతావరణ సూచన సాంకేతికలతో సహా సాంకేతికత పాత్ర పోషించిన సీఎంను ఆయన అభినందించారు.

అతను సాంకేతిక సామర్ధ్యాలు, మానవ ఇంటర్ఫేస్ కలయిక ప్రభావితం గత మైలు కనెక్టివిటీ మెరుగ్గా ఉపయోగించారని తెలిపారు. భద్రతకు మిలియన్ల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు, ఐఎండీ ప్రయత్నాలు ఖచ్చితమైన సూచనలను ఇవ్వడాన్ని ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. తీర ప్రాంతాలలో నివసిస్తున్న మత్స్యకారులను కాపాడడంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలను ప్రధాని కొనియాడారు. మౌలిక సదుపాయాలకు, గృహాలకు, మత్స్యకారులకు, రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

కేంద్ర బృందం త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. విద్యుత్, టెలికాం, రైల్వే సేవలను సకాలంలో, యుద్ధప్రాతిపదికన పునరుద్దరించడంలో యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషిచేసిందన్నారు. దెబ్బతిన్న రోడ్డు, ఉపరితల రవాణా వ్యవస్థలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడంలో కేంద్ర మంత్రిత్వశాఖ సకాలంలో స్పందించిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here