మాస్కో, మే 6 (న్యూస్‌టైమ్): రష్యాలోని మాస్కో విమానాశ్రయంలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో 41 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఆరుగురు గాయపడినట్లు ఈ ఘటనపై విచారణ జరుపుతున్న విచారణ కమిటీ వెల్లడించింది. రష్యాకు చెందిన ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. అవి కొద్దిసేపటికే విమానం వెనుక భాగంలో పెద్ద ఎత్తున అలముకున్నాయి.

దీంతో అందులోని ప్రయాణికులు 41 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి 78 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు. మిగిలిన 37 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానంలో మంటలు చెలరేగిన వెంటనే ప్రయాణికులు ఒక్కొక్కరుగా విమానం ముందువైపు ద్వారం నుంచి బయటపడ్డారు. విమాన టేకాఫ్‌ అయిన తర్వాత విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందనేది తెలియరాలేదు. టేకాఫ్‌ అయిన తర్వాత దాదాపు 45 నిమిషాలపాటు విమానం మాస్కోలో రెండు సార్లు గాల్లో చక్కర్లు కొట్టినట్లు ‘ఫ్లైట్‌ రాడార్‌ 24’ పేర్కొంది. దీనిపై రష్యా ప్రభుత్వం దర్యాప్తు కమిటీని నియమించింది. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలతో పాటు భద్రతా నియమాలను పైలట్లు ఏమైనా ఉల్లంఘించారా? వంటి అంశాలపై ఈ కమిటీ దర్యాప్తు చేస్తోంది.

ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తదితరులను విచారిస్తామని కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు.