అమరావతి, మే 10 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో నేరస్తులకు చోటులేదని, ఆర్ధిక నేరగాళ్ల భరతం పట్టేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే జరిగిందనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల అనంతరం నియోజకవర్గాల వారీగా పార్టీ విజయావకాశాలను విశ్లేషిస్తున్న ఆయన శుక్రవారం శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్నారు. ప్రతి కార్యకర్త రాజకీయాలను అధ్యయనం చేసే స్థాయికి చేరాలని, 37 ఏళ్లుగా రాజకీయాలు చేస్తున్న వారంతా మరింతగా రాణించాలని పిలుపునిచ్చారు.

మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి న్యాయం కోసమే తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకశక్తులను కూడగట్టామన్న చంద్రబాబ భాజపాకి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగామన్నారు. నరేంద్ర మోదీ వ్యతిరేక గాలిని దేశవ్యాప్తంగా ఉద్ధృతం చేశామని, ఓటమి నైరాశ్యంతోనే నరేంద్రమోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అసహనంతోనే మోదీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. 26 ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్‌ గురించి మాట్లాడుతున్నారని, గత ఐదేళ్లలో తానేం చేశారో నరేంద్రమోదీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చేసింది చెప్పేందుకు ఏమీ లేదు కాబట్టే మోదీ చౌకబాబు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ప్రధానిగా ఇకపై ఉండరని, కొత్త ప్రధాని రాబోతున్నారని స్పష్టం చేశారు. భారత రాజకీయాల్లో హుందాతనం మోదీ వల్ల కొరవడిందని, ఈవిధమైన చౌకబారు వ్యాఖ్యలు, దిగజారుడు రాజకీయాలు గతంలో లేవని సీఎం వ్యాఖ్యానించారు. మొదట్లో గుజరాత్‌ నమూనా అని మోదీ హోరెత్తించారని, ఇప్పుడా గుజరాత్‌ మోడల్‌ ప్రజల్లో ఘోర వైఫల్యంగా తేలిందని చంద్రబాబు విమర్శించారు.

సమీక్షలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు సహా ఆ నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్ధులుగా పోటీచేసిన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.