హైదరాబాద్, మే 10 (న్యూస్‌టైమ్): ‘మన చట్టాలు ఏం చెబుతున్నాయి’ అనే శీర్శికతో ఈ నెల 11వ తేదీ శనివారం నుండి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నట్లు టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలియచేశారు. ఇప్పటికే అనేక ప్రత్యేక కార్యక్రమాల ప్రసారాలు అందించి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు తదితర విభాగాల ప్రశంసలు చూరగొన్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయన్నారు.

ఈ నెల 11వ తేదీ శనివారం ఉదయం ఏడు గంటలకు ‘మన చట్టాలు ఏం చెబుతున్నాయి’ అనే శీర్శికతో భారత న్యాయశాస్త్రంలోని చట్టాలకు సంబంధించిన కార్యక్రమాలను టి-సాట్ నిపుణ ఛానల్ ద్వారా ప్రారంభం అవుతాయని శైలేష్ రెడ్డి ప్రకటించారు. మొదటి విడతలో 15 ఎపిసోడ్స్ ప్రసారం చేయనున్నామని, వీటిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం-ఆర్.ఆర్.యాక్ట్, వారసత్వ చట్టం, అపార్టుమెంట్ యాక్ట్ వంటి ప్రధాన చట్టాలకు సంబంధించిన ప్రసారాలుంటాయని స్పష్టం చేశారు. అనుభం కలిగిన న్యాయవాదులు ఈ అంశాలపై వివరిస్తారని, నిత్యం ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలపై న్యాయవాదులు అందించే సలహాలు-సూచనలతో పరిస్కారం పొందవచ్చని శైలేష్ రెడ్డి తెలిపారు.

ప్రతి శనివారం ఉదయం ఏడు గంటలకు ‘నిపుణ’ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం మరుసటి రోజు ఆదివారం రాత్రి తొమ్మది గంటలకు ‘విద్య’ ఛానల్‌లో పున:ప్రసారం అవుతుందన్నారు. నిత్య జీవితంలో న్యాయపరమైన సమస్యలను అధిగమించాలంటే టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రసారం చేసే ‘మన చట్టాలు ఏం చెబుతున్నాయి…’ ప్రత్యేక ప్రసార కార్యక్రమాన్ని విధిగా చూడాలని సీఈవో శైలేష్ రెడ్డి కోరారు. ఈ ప్రసారాలు యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉండనున్నాయన్నారు.