శ్రీకాకుళం, మే 11 (న్యూస్‌టైమ్): శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కారానికై ప్రజలు మద్దతుతో పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు యాజమాన్యాన్ని హెచ్చరించారు. శనివారం అరబిందో కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ పరిష్కరించాలని కోరుతూ మే 21, 22న చేపట్టబోతున్న సమ్మెకు మద్దతుగా ‘గెట్‌ టు గెదర్‌’ కార్యక్రమాన్ని పైడిభీమవరంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు. సిటూ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోవిందరావు మాట్లాడుతూ అరబిందో యాజమాన్యానికి యూనియన్‌కు మధ్య జరిగిన వేతన ఒప్పందం 2018 మార్చితో ముగిసిందన్నారు.

నూతన వేతన ఒప్పందం కోసం యూనియన్‌ చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ను మార్చి నెలలో ఇచ్చి 13 నెలలైనా నేటికీ పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. కార్మికుల శ్రమతో కోట్లాది రూపాయలు లాభాలార్జిస్తున్న అరబిందో యాజమాన్యం కార్మికులకు వేతనాలు పెంచకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అండతో చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్స్‌ పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తోందని, అరబిందో కార్మికులు ఒంటరిగా లేరని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యూనియన్లన్నీ ఐక్యంగా పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నారని యాజమాన్యాన్ని హెచ్చరించారు. దశలవారీగా పోరాటాలు నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.

మే 13న పైడిభీమవరం జంక్షన్లో మోకాలిపై ధర్నా, 15న మోటార్‌ బైక్‌ ర్యాలీ ఉదయం 6 గంటలకు పైడిభీమవరంలో ప్రారంభించి గ్రామాల్లో పర్యటన, 17న మెంటాడ-ధోనుపేట వద్ద జలదీక్ష, 18న భిక్షాటన కార్యక్రమం, 19న పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ, మే 19న మానవహారం, 20న అరబిందో పరిశ్రమ వద్ద సమ్మెకు మద్దతుగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, అరబిందో కార్మికుల పోరాటానికి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్ హెల్పెర్స్‌ యూనియన్‌, మధ్యాన్నభోజనం పధకం యూనియన్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌, శ్యాంక్రగ్‌ పిస్టన్స్‌ రింగ్స్‌ ప్లాంటు-2, ప్లాంటు-3, యునైటెడ్‌ బ్రేవరీస్‌, స్మార్ట్‌ కమ్‌ ఎంప్లాయిస్‌ తదితర యూనియన్లు తమ సంపూర్ణ మద్దతు తెలియచేసాయి.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సిహెచ్‌. అమ్మన్నాయిడు, ఎన్‌.వి. రమణ వివిధ సంఘాల నాయకులు జి.బి.టి. సుందరి, యం. అప్పలనరసయ్య, బి.రామకృష్ణ, నారాయణరావు, పి.రామారావు, కె.రాజారావు, ఎమ్‌. శ్యాంసుందరరావు, ఎస్‌. సీతారామరాజు, పి.వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు.