లక్నో, మే 11 (న్యూస్‌టైమ్): బహుజన్ సమాజ్ పార్టీ ఛీప్ మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. బీఎస్పీ – ఎస్పీ పొత్తు కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడాన్ని మాయావతి తప్పుబట్టారు. తమది కులాల కూటమి అని మోదీ వ్యాఖ్యానించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనమని, ఈ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వెనుకబాటు తరగతుల బాధలు, నొప్పి మోదీకి తెలియదని మాయావతి మండిపడ్డారు. మోదీ అలా వ్యాఖ్యానించడం సరికాదని, మోదీ వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్ ఇవాళ ఆయనను ప్రధానిని చేసి ఉండేది కాదని వ్యాఖ్యానించారు.

మోదీ ఒక్కసారి గుజరాత్ వైపు చూస్తే బాగుంటుందన్నారు. గుజరాత్‌లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, బడుగు, బలహీనవర్గాల వారు గౌరవప్రదంగా జీవించలేక పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు పెళ్లి చేసుకుంటే వారిని గుర్రపుబగ్గీపై కూడా ఊరేగకుండా అగ్రకులాలు అడ్డుకుంటున్నాయని మాయావతి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఓబీసీ కాదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘పుట్టుకతో ప్రధాని మోదీ ఓబీసీ కాదు. అందుకే వెనకబడిన వర్గాలు పడే బాధల్ని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదు. మహాకూటమి కులరాజకీయాలు చేస్తోందన్న ఆయన ఆరోపణలు సరికాదు.

ఒకవేళ మోదీ ఒబీసీయే అయి ఉంటే ఆరెస్సెస్‌ అయన్ని ప్రధాని కానిచ్చేదా’’ అని మాయావతి ప్రశ్నించారు. మరోసారి ప్రధాని కావాలన్న మోదీ కలలు సాకారమయ్యే అవకాశాలు ఏమాత్రం లేవని మాయావతి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలపై ఆయన చేస్తున్న ఆరోపణలతో అది స్పష్టమవుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీపై విరుచుకుపడుతున్న మాయావతి ఆయన అసలైన ఓబీసీ కాదని అనేక సార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసమే ఆయన తన కులాన్ని వెనకడిన వారి జాబితాతో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన మోదీ తనను కుల రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు. అత్యంత వెనకబడిన కులం నుంచి వచ్చానని, అందుకే ప్రతిపక్షాలు తనపై దాడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.