హైదరాబాద్, మే 11 (న్యూస్‌టైమ్): సినిమా ప్రభావం సమాజంపై ఉంటుందని గట్టిగా నమ్మేవారు ఎన్టీఆర్. అందుకే ఆయన తన పాత్రలను ఉన్నతంగా ఉండేలా చూసుకునేవారు. తన సినిమాల ద్వారా ఎంతో కొంత సందేశాన్ని ఇవ్వాలనుకునేవారు. అలాంటి సినిమాలలో ఒకటి 1969లో విడుదలైన ‘వరకట్నం’ సినిమా. సొంత బ్యానరుపై నిర్మించిన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఎన్టీఆరే నిర్వహించారు. అంతకుముందు పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ ఒక సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించడం అదే మొదటిసారి. అయితేనేం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘వరకట్నం’ సినిమా ఆ ఏడాది జాతీయ అవార్డును అందుకుంది.

1970 ఫిబ్రవరి 13న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 16వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాటి రాష్ట్రపతి వి.వి.గిరి చేతులమీదుగా ఉత్తమచిత్ర దర్శకుని అవార్డును అందుకుంటున్న నందమూరి తారక రామారావు జ్ఞాపకం ఇది.