విశాఖపట్నం, మే 11 (న్యూస్‌టైమ్): ఇక్కడి ఇందిరాగాంధీ జంతు ప్రదర్శన శాలలో (జూలో) మృగరాజు నీటి కొలను నుంచి బయటకు రావటంలేదు. పులి గాండ్రించటంలేదు. పక్షులు చురుగ్గా ఉండడంలేదు. మిగిలిన కృ జంతువులూ సేమ్‌ టు సేమ్‌! ఎందుకిలా? విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్. సందర్శకులకు దర్శనమివ్వని వన్యప్రాణులు. నీడచాటున తప్ప మరెక్కడా కానరాని జంతువులు. ఈ పరిస్థితికి కారణం ఒకటే! ప్రజలను చండప్రచండ వీక్షణంతో బెంబేలెత్తిస్తోన్న భానుడు జంతువులపైనా అంతే తీక్షణతను చూపుతున్నాడు. దీంతో మూగప్రాణులు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి.

విశాఖపట్నంలో ప్రస్తుతం 37 డిగ్రీలకు తక్కువ కాకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జంతువులు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం అల్లాడుతున్నాయి. ఎండకు బెదిరి చెట్ల నీడన, బోనుల్లోనే ఉండిపోతున్నాయి. జంతువులకు నీరూ ప్రధాన సమస్యగా మారింది. జూపార్క్‌లోని నీటికొరత కారణంగా మూగజీవుల సంరక్షణ కష్టతరమైందని అధికారులు చెబుతున్నారు. అయినా వేసవితాపం నుంచి మూగజీవాలను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అంటున్నారు. మరోవైపు, హూద్ హూద్ తుపాను వల్ల 2500 భారీ వృక్షాలు విశాఖ జూలో అప్పట్లో నేలకొరిగాయి.

దీని వల్ల పచ్చదనం తగ్గి ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపం నుంచి జంతువులను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు. వేసవిలో వన్యప్రాణులను కాపాడుకోవడం జూ అధికారులకు సవాల్‌గా మారుతోంది. గత ఏడాది 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వేసవి దాన్ని తలదన్నే రీతిలో ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూలోని అరుదైన జంతుజాలాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.