అమరావతి, మే 14 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్‌ సంధ్యారాణి విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5%మంది పరీక్షలకు హాజరయ్యారు. పదో తరగతి పరీక్షల్లో 94.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంధ్యారాణి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. అందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి. పది ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది.

83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా, పదో తరగతి (సీబీఎస్సీ సిలబస్)లో ఏపీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన విద్యార్థిని, విజయవాడకు చెందిన గొర్రల నవ్య, మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది.

తల్లి జిఆరెస్ వరలక్ష్మి, తండ్రి శ్రీనివాస్‌‌లతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన నవ్యను చంద్రబాబు అభినందించి మిఠాయి తినిపించారు. గుణదలలోని సెంట్ జాన్స్ పాఠశాలలో చదివిన నవ్య మొత్తం 500 మార్కులకుగాను 491 సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here